సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని బరాఖత్ గూడెం నుంచి హుజూర్ నగర్ మండలం రాయినిగూడెం వరకు వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న చిలుకూరు మండలం పోలేనిగూడెం గ్రామం వంతెన పనులు మూడేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. నిధులున్నప్పటికీ... గుత్తేదారుల నిర్లక్ష్యం వల్ల పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది.
నాగార్జునసాగర్ ఎడమ కాలువనుంచి బేతావోలు వీర్లందేవి చెరువుకు నీరు వచ్చే కాలువపై వంతెన లోతు తక్కువగా ఉండి, రహదారిపై నుంచి నీరు ప్రవహించడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మూడేళ్ల క్రితం నూతన వంతెనకు ప్రభుత్వం నిధులిచ్చింది. గుత్తెదారులు కూడా వెంటనే పనులు ప్రారంభించారు.
రానురాను గుత్తేదారుల నిర్లక్ష్యం కారణంగా నలభై శాతం పనులు మిగిలిపోయాయి. కాలువపై వంతెన నిర్మాణంలో కనీసం సైడ్ వాల్స్‌ను కూడా నిర్మించలేదు. గతంలో కాలువ ప్రవాహానికి వాహనాలు కొట్టుకుపోయిన పరిస్థితులు చాలానే ఉన్నాయి. వంతెనపై ఆశలు వదులుకున్న గ్రామస్థులు తాత్కాలిక ఏర్పాట్లు చేసుకొని వంతెనపై రాకపోకలు సాగిస్తున్నారు.