సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లి గుట్టపై లింగమంతులు జాతర ప్రారంభం కానుంది. ఈ నెల 14వ తేదీన దిష్టి పూజతో జాతర మొదలవుతుంది. అనంతరం 28 నుంచి మార్చి 4 వరకు... 5 రోజుల పాటు కన్నులపండువగా సాగనుంది. స్థానికులతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో జాతరకు తరలివస్తారు. ప్రతిఏటా దాదాపు 8 లక్షల మంది హాజరవుతుంటారు. స్వామివారిని దర్శించుకొని మెుక్కులు చెల్లించుకుంటారు.
పూర్తి కాని ఏర్పాట్లు
ఈ ఏడాది జాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్లు కేటాయించింది. అయితే... జాతర ప్రారంభం కావటానికి కొద్ది రోజులే సమయం ఉండగా.... ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదు. తాగునీరు, మరుగుదొడ్లు, స్నానాల గదులు వంటి వసతుల కల్పించలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆలయం ప్రసిద్ధి గాంచి ఏళ్లు గడుస్తున్నా.... ప్రభుత్వం ప్రతి ఏటా నిధులు కేటాయిస్తున్నా..... శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి జరగటం లేదని స్థానికులు వెల్లడించారు. ఆలయానికి మూడు వైపుల గల మెట్ల దారులకు రాజగోపురాలు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.