తెలంగాణ

telangana

ETV Bharat / state

అమ్మకే అమ్మ అయిన చిన్నారి - problems

ఈ చిన్నారి కష్టం చూస్తే కన్నీళ్లకే కన్నీళ్లొస్తాయి. అమాయకపు చూపుల వెనుక అంతులేని ఆవేదన దాగుంది. చిన్నతనంలోనే అగ్ని పర్వతం లాంటి బాధను గుండెల్లో దాచుకుని అమ్మకే అమ్మ అయిన ఈ చిన్నారి గాథ మనసుని మెలిపెట్టేస్తుంది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి... మానసిక వికలాంగురాలైన తల్లిని కనుపాపలా సాకుతోంది. నా అనేవాళ్లు లేకున్నా... చదువొక్కటే వారి బతుకులను మారుస్తుందనే నమ్మకంతో బాధలను దిగమింగి పైకి నవ్వుతూ కనిపిస్తోంది సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన గైగుళ్ల శోభారాణి.

అమ్మకే అమ్మ అయిన చిన్నారి

By

Published : Jul 22, 2019, 9:52 AM IST

అమ్మకే అమ్మ అయిన చిన్నారి

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన గైగుళ్ల శ్రీనివాస్​, ఉపేంద్ర దంపతులు. వీరి కుమార్తె శోభారాణి. తాపీపని చేస్తూ జీవనం సాగించే వీరిది రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం. కష్టాలను దిగమింగుతూ సాగిపోతున్న ఈ కుటుంబంపై విధి కన్నుకుట్టింది. పని ముగించుకుని ఇంటికి తిరిగొస్తున్న శ్రీనివాస్​ రెండేళ్ల కిందట జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందాడు. అతని భార్య ఉపేంద్ర మానసిక వికలాంగురాలు.

మరణంతో చితికిపోయారు

శ్రీనివాస్​ మరణం ఆ కుటుంబాన్ని కష్టాల సుడిగుండంలోకి నెట్టేసింది. తండ్రి మరణించిన సమయంలో అంత్యక్రియలకు కూడా చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి. గ్రామ ప్రజల సహకారంతో దహన సంస్కారాలు జరిపించారు. మతిలేని తల్లి చిన్నారికి భారంగా మారింది. నా అనేవాళ్లు లేకపోయినా మతిస్తిమితం లేని తల్లిని చంటి పిల్లలా సాకుతోంది శోభారాణి.

అమ్మకు అన్నీ తానై...

స్థానికంగా ఉన్న పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న శోభారాణి ఉదయం తల్లికి వండిపెట్టి స్కూలుకు వెళ్తోంది. సాయంత్రం బాలికల వసతి గృహంలో భోజనం చేసి తల్లికి కాస్తంత తీసుకెళ్లి తినిపిస్తూ జీవనం సాగిస్తోంది. ఇళ్లు అనడానికే వీలుకాని దాంట్లో ఆ తల్లీ కూతురు తలదాచుకుంటున్నారు. వానొచ్చినా, ఎండొచ్చినా వారి బతుకులు దుర్భరమే. రాత్రి పూట పక్కింట్లో తలదాచుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఎవరైనా తనకు సాయమందించండని ఆ చిన్నారి దీనంగా వేడుకుంటోంది.

సాయపడండి..

పైకి నవ్వుతూ కన్పిస్తున్నా ఆచిన్నారి కష్టాలు తెల్సుకుని ఉపాధ్యాయులు కలత చెందారు. తలోకొంత వేసుకుని చిన్నారి ఆర్థిక సాయం చేశారు. తోటి విద్యార్థులు కూడా తమ వంతు సాయం అందించారు. చదువులో చక్కగా రాణిస్తున్న ఈ చిన్నారికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు చేయూత అందివ్వాలని స్థానికులు వేడుకుంటున్నారు. నా అనేవాళ్లు లేని ఈ అభాగ్యురాలిని ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ఇదీ చూడండి: ఈ చిన్నారిని బతికించేవారెవరైనా ఉన్నారా?

ABOUT THE AUTHOR

...view details