తెలంగాణ

telangana

ETV Bharat / state

కూరగాయల సాగులో స్వయం సమృద్ధి దిశగా అడుగులు..!

దళారుల బారినపడి మోసపోతున్న కూరగాయల రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. రైతుల చెంతనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా 8 గ్రామాలను డీఆర్​డీఏ అధికారులు ఎంపిక చేశారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న ఆహార శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి.

By

Published : Jul 8, 2019, 8:24 PM IST

vegetable

కూరగాయల సాగులో స్వయం సమృద్ధి దిశగా అడుగులు..!

కూరగాయల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు రంగంలోకి దిగారు. ఇందుకోసం కూరగాయల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటి నిర్వహణ బాధ్యతలను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ( సెర్ఫ్) ఆధ్వర్యంలోని మహిళా సంఘాల నేతృత్వంలోని రైతు ఉత్పత్తిదారుల సంఘానికి అప్పగించింది.

8జిల్లాలు ఎంపిక

కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా పండిస్తున్న గ్రామాలను ఇప్పటికే గుర్తించారు. సూర్యాపేట, సిద్దిపేట, ఆదిలాబాద్​, ఆసిఫాబాద్, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూలు జిల్లాల్లోని ఒక్కో మండలంలో ఒక్క గ్రామంలో కూరగాయల సేకరణ చేపట్టనున్నారు. ఈ ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్​ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. మండల స్థాయిలో రైతు ఉత్పత్తిదారుల కంపెనీలను ఏర్పాటు చేస్తారు. ఒక్కో సభ్యుడు వాటాధనంగా రూ.500, సభ్యత్వానికి మరో వంద రూపాయలు చెల్లించాలి.

సూర్యాపేటలో లక్ష్మీనాయక్ తండా ఎంపిక

సూర్యాపేట జిల్లాలోని అత్యధికంగా కూరగాయలు పండిస్తున్న చివ్వెంల మండలం లక్ష్మీనాయక్ తండాలో కూరగాయల సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకోసం గ్రామ సర్పంచ్​ తన ఇంటిని తాత్కాలికంగా ఇచ్చారు. ఈ గ్రామం పరిధిలో 12 తండాలున్నాయి. ఇక్కడి రైతులు సమీపంలోని సూర్యాపేట మార్కెట్​లో హోల్​సేల్ వ్యాపారులకు వారు అడిగిన ధరలకు ఇవ్వాల్సిన దుస్థితి ఉంది. లక్ష్మీనాయక్ తండాలో సుమారు 159 ఎకరాల్లో 161 మంది రైతులు కూరగాయల పంటలు పండిస్తున్నారు. తమ గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుండటం సంతోషంగా ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

లాభాలు పంచుతారు

రైతుల నుంచి సేకరించిన కూరగాయలను, ఆకుకూరలను సూపర్ మార్కెట్ సంస్థ రత్నదీప్​​తో సెర్ఫ్ ఒప్పందం చేసుకుంది. మోర్, హెరిటేజ్ సూపర్ మార్కెట్ నిర్వాహకులు కూడా ఇక్కడి కూరగాయలను తీసుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. కంపెనీకి వచ్చే లాభాలను సభ్యులైన రైతులకు పంచుతారు. మొత్తానికి దళారుల బెడద తప్పడంతో పాటు విక్రయాలు లేక పారబోసే పరిస్థితి నుంచి రైతులకు ఊరట లభించనుంది.

ఇదీ చూడండి: కాళేశ్వరంలో పరుగులు పెడుతున్న గోదారమ్మ

ABOUT THE AUTHOR

...view details