తెలంగాణ

telangana

ETV Bharat / state

ధరల మంట... కూరగాయలు వండేదెట్టా...? - vegetables

కూరగాయల హబ్​గా పేరొందిన సిద్దిపేట జిల్లాలో కూరగాయల ధరలు ఆకాశనంటుతున్నాయి. గతేడాదితో పోలిస్తే భూగర్భజలాలు మరిన్ని తగ్గాయి. బోర్లు, బావులు చాలా వరకు ఎండిపోయాయి. దీంతో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. సామాన్యుడు కనీసం కూరగాయలు కొందామన్నా ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.

ధరల మంట... కూరగాయలు వండేదెట్టా...?

By

Published : Jul 16, 2019, 10:06 AM IST

సిద్దిపేట జిల్లాలో ఏడాది వ్యవధిలో 40,500 ఎకరాల్లో అన్నదాతలు కూరగాయలు సాగు చేస్తారు. ఇందులో భాగంగా వేసవి సీజన్‌లో (ఫిబ్రవరి, మార్చి) 12,150 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉన్నా నాలుగు వేల ఎకరాల్లోనే పంట వేశారు. సాధారణ విస్తీర్ణంలో ఇది 33 శాతం మాత్రమే. గతేడాది వర్షాభావ పరిస్థితులతో 2019, ఫిబ్రవరి నుంచి భూగర్భ జలమట్టాలు తగ్గుతున్నాయి. 2018తో పోల్చినపుడు మట్టాలు బాగా పడిపోయాయి. ఈ ప్రభావంతో బోర్లు, బావులు ఎండిపోయాయి. ఫలితంగా సాగు చేసిన పంటలూ పూర్తిగా చేతికి రాలేదు. పైగా నాణ్యత తగ్గింది. దీంతో దాదాపు రెండు నెలలుగా ధరలు పెరుగుతుండడం గమనార్హం. దీంతో పేద కుటుంబాలు కూర చేసుకోవాలంటే ఆలోచించాల్సిన స్థితి ఏర్పడింది. జిల్లాలో పండించిన కూరగాయల్లో కొంత భాగం హైదరాబాద్‌కు ఎగుమతి అవుతున్నాయి. దీంతో డిమాండ్‌కు సరిపడా అందుబాటులో లేక ధరల పెరుగుదలపై ప్రభావం పడుతోంది. వరుణుడు కరుణించకపోవడంతో ఖరీఫ్‌లోనూ కూరగాయల సాగుపై ప్రభావం పడుతోందన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.

రైతుబజారుపై ప్రభావం
జిల్లా కేంద్రంలోని రైతుబజారుపై ప్రభావం సృష్టంగా కనిపిస్తోంది. గత ఏడాది జూన్‌, జులైలో సగటున రోజుకు 650 క్వింటాళ్ల కూరగాయలను రైతులు విక్రయించేవారు. ఈసారి ఇదే నెలల్లో నిత్యం సగటున 300 క్వింటాళ్లు మాత్రమే అమ్ముడవుతున్నాయి. అదేస్థాయిలో రైతుబజారుకు వస్తుండడం గమనార్హం. ఇక్కడికి తీసుకొచ్చే కూరగాయల పరిమాణం సగానికన్నా అధికంగా పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

వంటిమామిడి’కి తగ్గిన కూరగాయల రాక
ములుగు మండలంలో వంటిమామిడి మార్కెట్‌ జిల్లాలోనే పెద్దది. ఇక్కడ నుంచి కూరగాయలను హైదరాబాద్‌కు ఎగుమతి చేస్తారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో పండించిన కూరగాయలను అన్నదాతలు ఇక్కడికి తెస్తుంటారు. గతంతో పోల్చితే ఇక్కడకు వాటి రాక 50 శాతం కంటే అధికంగా పడిపోయింది. గతేడాది జూన్‌, జులైలో నిత్యం సగటున 950 క్వింటాళ్లు రాగా, ఈసారి 450 క్వింటాళ్లకు పరిమితమైంది.

కార్యరూపం దాల్చని క్లస్టర్లు...
సిద్దిపేట జిల్లా 2016, అక్టోబరు 11న ఆవిర్భవించింది. హైదరాబాద్‌ చెంతనే ఉండడంతో జిల్లాను కూరగాయల హబ్‌గా మార్చాలని ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్ణయించారు. 2017లో జిల్లాలో ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేసి సాగుకు ఊతమిద్దామని ప్రణాళిక రూపొందించారు. సిద్దిపేట, చిన్నకోడూరు, అక్కన్నపేట, చేర్యాల, గజ్వేల్‌, మర్కూక్‌ మండలాల్లోని 31 గ్రామాలను ఎంపిక చేశారు. రాయితీ, అధునాతన సాంకేతికత అందించడంతో పాటు బిందు, తుంపర పరికరాల ద్వారా కూరగాయల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించినా ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం.

ఇవీ చూడండి: గురువుల పండుగ గురుపౌర్ణమి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details