జహీరాబాద్ పార్లమెంట్లో తెరాస అభ్యర్థి బీబీ పాటిల్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన రావుపై 4,471 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఉదయం ఫలితం విడుదలైన మొదటి రౌండు నుంచి ఇదే ఆధిక్యాన్ని కనబరిచారు. వరుసగా రెండోసారి విజయాన్నందించిన జహీరాబాద్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
జహీరాబాద్‌లో స్వల్ప ఆదిక్యంతో గెలిచిన బీబీపాటిల్ సంక్షేమమే బలంగా
తెరాస ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు బీబీ పాటిల్. అవి కొనసాగాలంటే తెరాస గెలిస్తేనే సాధ్యమన్న వాదనను తెరాస ఎమ్మెల్యేలు బలంగా తీసుకెళ్లగలిగారు. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం పాటిల్‌కు కలిసొచ్చిన మరో అంశం.
పనిచేయని కాంగ్రెస్ వ్యూహాలు
హస్తం పార్టీ నుంచి పోటీ చేసిన మదన్ మోహన్‌రావు గట్టి పోటీ ఇచ్చినా... ఫలితం లేకపోయింది. ప్రచారంలో వినియోగించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మదన్ మోహన్‌కు మేలు కలిగించలేకపోయింది. మైనార్టీ ఓటు బ్యాంకు, ఉపాధి కల్పనకు చేస్తున్న కార్యక్రమాలు సైతం జహీరాబాద్ ఓటర్లపై ప్రభావం చూపలేకపోయాయి. 2014 ఎన్నికల్లో భాజపా మద్దతుతో తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన మదన్ మోహన్‌రావు అనంతరం కాంగ్రెస్‌లో చేరి... పోటీ చేశారు.
పని చేయని మోదీ మానియా
జహీరాబాద్‌లో భాజపా తరఫున పోటీ చేసిన లక్ష్మారెడ్డి మోదీ మానియాను నమ్ముకున్నప్పటికీ అది పనిచేయలేదు. ప్రచారంలో ప్రజల మనసు గెలుచుకోవడంలో విఫలమయ్యారు.
ఇదీ చూడండి : తెలంగాణలో గెలిచిన ప్రశ్నించే గొంతుక