మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూ సేకరణలో భాగంగా సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ వాసులను ఖాళీ చేయించొద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. పరిహారానికి సంబంధించిన వివాదంలో దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లను విచారించిన ధర్మాసనం.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఆదేశించింది.
నోటిఫికేషన్ గడువు ముగిసిందని..
మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం తాము నివాసం ఉంటున్న ప్రాంతంలో భూ సేకరణకు ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ గడువు ముగిసిందని, చట్టప్రకారం భూ సేకరణ పరిహారం చెల్లించకుండా ఖాళీ చేయించే ప్రయత్నాలను సవాలు చేస్తూ.. నాయిని లింగం అనే వ్యక్తి సహా మరో 35 మంది హైకోర్టును ఆశ్రయించారు. అవివాహితులను ప్రత్యేక కుటుంబంగా పరిగణించి పరిహారం చెల్లించకపోవడాన్ని సవాలు చేస్తూ ఇదే గ్రామానికి చెందిన శ్రీలేఖ అనే యువతి సహా మరో 50 మంది పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.