సిద్దిపేట జిల్లాలోని అనంతగిరి రిజర్వాయరు కోసం చేపట్టిన భూసేకరణలో భాగంగా ఇప్పటికే జారీ చేసిన చెక్కులకు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలంటూ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ కోరింది. అనంతగిరి రిజర్వాయర్ పనుల కోసం ప్రజల నుంచి భూములు సేకరించి చెక్కుల సొమ్ము బ్యాంకులు చెల్లించేలా.. జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలంటూ జులై 10న హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వాటిని అమలు చేయకపోవడంపై సిద్దిపేట జిల్లా చిన్నకొండూరు మండలం... కొచ్చగుట్టపల్లికి చెందిన తీపిరెడ్డి మమత, గడ్డం ప్రభాకర్లు వేర్వేరుగా కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
జారీ చేసిన చెక్కుల చెల్లింపులు నిలిపివేస్తారా..?: హైకోర్టు
అనంతగిరి రిజర్వాయరు నిమిత్తం చేపట్టిన... భూ సేకరణలో భాగంగా చెక్కుల పంపిణీ జాప్యంపై ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ కోరింది. ఇప్పటికే జారీ చేసిన చెక్కులకు వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని... గతంలో ఇచ్చిన ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది.
అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ వాదనలు వినిపిస్తూ... గత నెల హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు. సుప్రీంకోర్టులో విచారణకు రావాల్సి ఉన్నందున.... గడువు కావాలని కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ హైకోర్టు ఉత్తర్వులను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదన్నారు. ఇప్పటికే జారీ చేసిన చెక్కులకు వెంటనే చెల్లించాలని హైకోర్టు ఆదేశించి నెల దాటినా చెల్లింపులు జరపలేదన్నారు.
చెక్కులకు చెల్లింపులను నిలిపివేయాలంటూ కలెక్టర్ ఎందుకు ఆదేశాలిచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం నిర్ణయించి... 3 నెలల్లో చెల్లింపులు చేయాలని.... ఒకవేళ ఇప్పటికే చెల్లించినట్లయితే ఆ మొత్తాన్ని రికవరీ చేయకుండా సర్దుబాటు చేయాలని తెలిపింది. దీనిపై తదుపరి విచారణను సెప్టెంబరు ఒకటోతేదీకి వాయిదా వేసింది.