సర్కారు దావాఖానాల్లో మెరుగైన వైద్య సేవలు అందించడంపై ప్రభుత్వం దృష్టి సారిచింది. ఇందులో భాగంగా ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు.. కేసీఆర్ కిట్ వంటి పథకాలు ప్రవేశ పెట్టింది. కానీ... అన్ని రకాల నిర్ధరణ పరీక్షలు చేయటానికి సౌకర్యాలు లేకపోవటంతో.... రోగులు ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబులను ఆశ్రయిస్తున్నారు. ఈ పరీక్షలకు ప్రైవేటు నిర్వాహకులు అధిక మెుత్తంలో వసూళ్లు చేస్తున్నారు. సమస్యను గుర్తించిన ప్రభుత్వం..... రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ పేరుతో ల్యాబులను ఏర్పాటు చేస్తోంది. పైలెట్ ప్రాజెక్టుగా సిద్దిపేట, ఖమ్మం, సిరిసిల్ల, కరీంనగర్, జోగుళాంబ, ములుగు జిల్లాలో ప్రారంభించారు.
అన్నీ ఫ్రీ...
డయాగ్నోస్టిక్ హబ్‌కు ప్రభుత్వ ఆసుపత్రులను అనుసంధానం చేస్తారు. ఆస్పత్రుల్లో నమూనాలు సేకరించి హబ్‌కు తరలించి నిర్ధరణ పరీక్షలు చేయనున్నారు. ఇందులో భాగంగా పరికరాల కొనుగోలు, మౌలిక వసతల కల్పనకు జిల్లాకు రెండున్నర కోట్లు కేటాయించారు. సాధారణ పరీక్షల నుంచి థైరాయిడ్, లివర్, గుండె, మూత్రపిండాలకు సంబంధించిన 57రకాల పరీక్షలు చేయనున్నారు. ఇవన్నీ ఉచితంగా అందించనున్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటగా సిద్దిపేటలో ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ హబ్ పనులన్నీ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం డ్రైరన్ నిర్వహిస్తున్నారు.