సికింద్రాబాద్‌లో భాజపా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిపై జరిగిన దాడిని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో ఆ పార్టీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించగా అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ భాజపా ఆందోళన
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షునిపై జరిగిన దాడిని నిరసిస్తూ ఆ పార్టీ నేతలు హుస్నాబాద్‌లో ఆందోళన చేపట్టారు. దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
'ఆహా' అనే ఓటీటీ ( యాప్) ద్వారా సెన్సార్ బోర్డు ధృవీకరణ లేకుండా అశ్లీల చిత్రాలను విడుదల చేయడాన్ని నిలిపివేయాలని కోరుతూ సికింద్రాబాద్‌లో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్ నిరసన చేపట్టారు. ఈ క్రమంలో ఆయనపై కొందరు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ నాయకుడు నరేష్ తెలిపారు. పోలీసులు అధికార పార్టీకి కార్యకర్తలుగా వ్యవహరించడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెరాస ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:థియేటర్లలోకి 100 శాతం ప్రేక్షకులు.. జూ.డాక్టర్ ఆవేదన