తెలంగాణ

telangana

ETV Bharat / state

చదువుల తల్లి.. తల్లడిల్లుతోంది.. సాయం చేయరూ..!!

గొర్రెల కాపరి ఇంట్లో పుట్టిన ఆ ముగ్గురు ఆడపిల్లలు చదువులో సరస్వతులు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల వల్ల తండ్రి ప్రభుత్వ బడుల్లోనే చేర్పించినా మెరుగైన ప్రతిభ చూపారు. ఇంకా చదివించడానికి తనకు స్తోమత లేదని తండ్రి అనడంతో ఒక్కొక్కరుగా విద్యకు దూరమవుతున్నారు. చదువును అయిష్టంగానే వదులుకున్న పెద్దమ్మాయి కుట్టుమిషను పని నేర్చుకొని ఇంటికి ఆసరాగా నిలిచింది. ఇప్పుడు రెండో కుమార్తె వంతు వచ్చింది. తన బిడ్డకు హార్టీసెట్‌లో రాష్ట్రస్థాయిలో మూడోర్యాంకు వచ్చినా.. ఫీజు కట్టలేని దైన్యం ఆ తండ్రిది. బిడ్డలు తెలివైనోళ్లయినా డబ్బుల్లేని కారణంగా వారి ఆకాంక్షలు నెరవేరడం లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు తల్లిదండ్రులు.

చదువుల తల్లి.. తల్లడిల్లుతోంది.. సాయం చేయరూ..!!
చదువుల తల్లి.. తల్లడిల్లుతోంది.. సాయం చేయరూ..!!

By

Published : Dec 3, 2022, 9:04 AM IST

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం కోనాయిపల్లికి చెందిన గొల్ల చిన్నోళ్లస్వామి, నాగమణి దంపతులకు ముగ్గురు అమ్మాయిలు. కళ్యాణి 2020లో అగ్రికల్చర్‌ డిప్లొమా పూర్తి చేసింది. ఆ బ్యాచ్‌లో 60 మంది ఉండగా ఆమె టాపర్‌గా నిలిచింది. ఉన్నత చదువులు చదవాలనుకున్నా డబ్బుల్లేక అయిష్టంగానే ఇంటికే పరిమితమైంది. కుట్టుమిషను పని నేర్చుకొని ఆసరాగా నిలిచింది. రెండో కుమార్తె స్రవంతి అగ్రికల్చర్‌ డిప్లొమా పూర్తి చేసింది. బీఎస్సీ (హార్టీకల్చర్‌) చదవాలని హార్టీసెట్‌ రాసింది. రాష్ట్రస్థాయిలో మూడోర్యాంకు సాధించింది.

ఈ నెల 5న కౌన్సెలింగ్‌కు హాజరవ్వాలి. అదే రోజు రూ.50 వేలు చెల్లిస్తేనే సీటు దక్కుతుంది. నాలుగేళ్లకు కలిపి మరో రూ.4 లక్షల వరకు ఖర్చవుతాయి. ఇంతమొత్తం వెచ్చించే స్తోమత ఆ కుటుంబానికి లేదు. ఈ అమ్మాయి పదో తరగతిలో 10/10 జీపీఏ సాధించింది. పేదరికం వేధిస్తున్నా ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేరి పట్టుదలగా చదివింది. బీఎస్సీ (హార్టీకల్చర్‌)లో చేరి ఉన్నతంగా రాణించాలని కలలుకంటున్న తాను ఇకపై తండ్రితో కలిసి గొర్రెలు మేపడానికి వెళ్లక తప్పదని ఆ చదువుల తల్లి స్రవంతి మౌనంగా రోదిస్తోంది. దాతలు ఎవరైనా స్పందిస్తే బాగా చదువుకొని మంచి స్థాయికి ఎదుగుతానని ఆశగా చెబుతోంది. కాగా మూడో అమ్మాయి ప్రస్తుతం మోడల్‌ స్కూల్‌లో పదో తరగతి చదువుకుంటోంది.

ABOUT THE AUTHOR

...view details