మల్లన్నసాగర్ బాధితుల సమస్యలు పరిష్కరించండి సిద్దిపేట జిల్లా తొగుట మండలం వద్ద మల్లన్నసాగర్ ప్రభావిత ప్రాంతాలను ఉమ్మడి మెదక్ జిల్లా న్యాయమూర్తి సాయి రమాదేవి పరిశీలించారు. హైకోర్టు ఆదేశాలతో ముంపు గ్రామాల ప్రజలు, అధికారులు, గుత్తేదారులతో సమావేశమయ్యారు. క్షేత్రస్థాయి పరిస్థితులను ఉన్నత న్యాయస్థానానికి నివేదించనున్నారు. మల్లన్న సాగర్ నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న తమకు పూర్తి స్థాయి పునరావాసం (ఆర్ అండ్ ఆర్), ఉపాధి కల్పించాలంటూ ప్రభావిత ప్రాంతాల రైతులు గత ఏడాది జూన్ 25న ఉన్నత న్యాయస్థానం తలుపు తట్టారు. పరిహారం చెల్లించేంత వరకు పనులు చేపట్టవద్దంటూ విజ్ఞప్తి చేశారు. అన్నదాతల సమస్యలు పరిష్కరించాలంటూ న్యాయస్థానం ఉత్తర్వులు వెలువరించింది.
కోర్టు ఆదేశాలను ఖాతరు చేయకుండా పనులు చేస్తున్నారని... కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ మరోసారి న్యాయస్థానం గడప తొక్కారు బాధితులు. విచారణ చేపట్టిన ధర్మాసనం కమిషనర్‌ను నియమించింది. పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
క్షేత్రస్థాయిలో పర్యటించిన కమిషనర్ నివేదిక సమర్పించారు. ఆ తర్వాత నిర్మాణాలు జరుగుతుండడంపై రైతన్నలు మరోసారి ధర్మాసనం ముందుకొచ్చారు.
అన్నదాతల ఆవేదన విన్న న్యాయమూర్తి ఎంఎస్ రామచంద్రరావు... క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక సమర్పించాలంటూ ఉమ్మడి మెదక్ జిల్లా న్యాయమూర్తిని ఆదేశించారు. కోర్టు ఆదేశాలతో జిల్లా జడ్జి సాయి రమాదేవి రైతులు, గుత్తేదారులతో సమావేశమై విచారణ చేపట్టారు.
ఇవీ చూడండి:రాహుల్ సభ ఏర్పాట్లను పరిశీలించిన భట్టి