తెలంగాణ

telangana

ETV Bharat / state

సిద్దిపేటకు రైలు బండి.. వచ్చేది అప్పుడేనండి!

వచ్చే ఏడాది మార్చి నాటికి సిద్దిపేటలో రైలు కూత పెట్టనుంది. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అనుకున్న సమయానికి సిద్దిపేటలో రైలును కూత పెట్టించడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. రాజధానితో ఈ పట్టణ రైల్వే అనుసంధానం కానుంది.

railway-services-will-start-next-year-in-siddipet
సిద్దిపేటకు రైలు బండి

By

Published : Feb 8, 2021, 11:40 AM IST

అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ, పలు అంశాల్లో రాష్ట్రానికే గాక దేశానికీ ఆదర్శంగా నిలిచిన సిద్దిపేట జిల్లాలో ప్రధాన రైల్వే మార్గం లేదు. ఎక్కడికైనా వెళ్లాలంటే.. ఎన్నో కిలోమీటర్లు బస్సుల ద్వారా ప్రయాణించాల్సిన పరిస్థితి. ప్రయాణికుల ఇబ్బందులను గమనించిన సర్కార్.. సిద్దిపేట పట్టణంలో రైల్వే సేవలు ప్రారంభించేందుకు నిర్ణయించింది. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టుతో పట్టణ ప్రజల కల నెరవేరనుంది.

మార్చిలో రైలు కూత

అన్నీ అనుకున్నట్లు జరిగితే.. వచ్చే ఏడాది మార్చి వరకు సిద్దిపేటలో రైలు కూత వినిపించనుంది. సాధారణ రైలు సేవలు తిరిగి మొదలైతే.. గజ్వేల్‌ వరకు నిత్యం ఓ సర్వీసు నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ సంవత్సరం జూన్‌ నాటికి కొడకండ్ల వరకు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అది పూర్తైతే గజ్వేల్‌ మీదుగా అక్కడి వరకు రైలు సేవలు పొడిగించాలని భావిస్తున్నారు. ఈ నిర్మాణం గజ్వేల్‌ తర్వాత 11.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

కొత్తపల్లితో పూర్తి

జూన్‌– జులై నాటికల్లా పనులు పూర్తి చేసేలా కొత్త షెడ్యూల్​ను ద.మ.రైల్వే రూపొందించింది. ఏవైనా అవాంతరాలు ఎదురై ఆలస్యం జరిగినా, సెప్టెంబరు నాటికన్నా రైలు అక్కడికి చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. 2023లో మరో 37.15 కి.మీ. పనులు పూర్తి చేసి సిరిసిల్ల వరకు ట్రాక్‌ సిద్ధం చేయాలని, 2024లో మిగతా 39 కి.మీ. పనులు పూర్తి చేసి చివరిస్టేషన్‌ కొత్తపల్లి వరకు పనులు చేయడం ద్వారా ప్రాజెక్టును ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా తెలిపారు.

మనోహరాబాద్ నుంచి మొదలు

మేడ్చల్‌ సమీపంలోని మనోహరాబాద్‌ స్టేషన్‌ నుంచి ఈ కొత్త లైను ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి 31 కి.మీ. దూరంలో ఉన్న గజ్వేల్‌ వరకు పూర్తి పనులు అయిపోయాయి. దుద్దెడ మధ్య ఎర్త్‌వర్క్‌ చివరి దశ నిర్మాణంలో ఉంది. మధ్యలో 52 చిన్న వంతెనల పనులూ పూర్తయ్యాయి. పెద్ద వంతెనలు నాలుగుండగా... మూడు చివరి దశలో ఉన్నాయి. కుకునూరుపల్లి వద్ద రాజీవ్‌ రహదారి మీద నిర్మించాల్సిన పెద్ద వంతెన పనులు మరో నాలుగైదు రోజుల్లో ప్రారంభం కానున్నాయి.

అదే లక్ష్యం..

కొడకండ్ల వద్ద కెనాల్‌ మీద నిర్మిస్తున్న వంతెన చివరి దశలో ఉంది. మరో వారం రోజుల్లో కొడకండ్ల వరకు రైలు ట్రాక్‌ వేసే పని ప్రారంభం కానుంది. రిమ్మనగోడు–కొడకండ్ల మధ్య, కొడకండ్ల కెనాల్‌ క్రాసింగ్, వెలికట్ట, సిద్దిపేట కలెక్టరేట్‌ వద్ద, దుద్దెడ స్టేషన్‌ సమీపంలో పెద్ద వంతెనల పనులు వేగంగా జరుగుతున్నాయి. వీటన్నింటిని నిర్దేశించిన గడువులోపల పూర్తిచేసేలా రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అన్నీ పూర్తైతే.. వచ్చే ఏడాది మార్చికి సిద్దిపేటకు రైలు పరుగులు పెడుతుందని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి.

ABOUT THE AUTHOR

...view details