సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలకు కలిపి కేవలం ఒకే ఒక్క అంబులెన్స్ మాత్రమే ఉంది. మూడు మండలాల్లో కలిపి 78 గ్రామాలున్నాయి. అన్ని గ్రామాలకు ఒక్కటే 108 వాహనం ఉండడం వల్ల సరైన సమయంలో ప్రజలకు అంబులెన్స్ సేవలు అందడం లేదు. హుస్నాబాద్ మండలంలో 17 గ్రామాలు, అక్కన్నపేట మండలంలో 32 గ్రామాలు, కోహెడ మండలంలో 29 గ్రామాలు ఉన్నాయి. విస్తీర్ణం దృష్ట్యా అక్కన్నపేట, కోహెడ మండలాలు పెద్ద మండలాలు. ఒకే సమయంలో వేర్వేరు చోట్ల ఏదైనా ప్రమాదం జరిగితే అత్యవసరంగా 108 సేవలను పొందడానికి బాధితులు ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు రోజురోజుకి హుస్నాబాద్‌తో పాటు.. పరిసర ప్రాంతాల్లో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది.
హుస్నాబాద్‌కు అంబులెన్స్ ఏర్పాటు చేయాలని వినతి
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ప్రాథమిక చికిత్స కేంద్రం పరిధిలో కేవలం ఒకే ఒక అంబులెన్స్ మాత్రమే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్క అంబులెన్స్ సర్వీసు సరిపోవడం లేదు. మూడు మండలాలకు కలిపి ఒక్క అంబులెన్స్ సరిపోవడం లేదని.. మరో అంబులెన్స్ ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు కాంగ్రెస్ నేతలు వినతి పత్రం సమర్పించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి నేటి వరకు కనీసం హుస్నాబాద్ ప్రాంతంలో ఎంతమందికి కరోన నిర్ధారణ అయింది? ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ ఉన్నవారిని ఎందరిని హోమ్ క్వారంటైన్లో ఉంచారు? వారిలో కోలుకుంటున్న వారి సంఖ్య ఎంత? అనేది స్పష్టత లేదు. కరోనా నిర్ధారణ జరిగిన వారిని, లక్షణాల తీవ్రత కలిగి ఉన్న వారిని, ఇతర ఎమర్జెన్సీ కేసుల కోసం కూడా మెరుగైన వైద్యం కోసం పట్టణాలకు తరలించడానికి సరైన అంబులెన్స్ సర్వీసు లేక ఇబ్బందులకు గురవడమే కాదు.. ప్రమాద తీవ్రత పెరిగి, ప్రాణనష్టం జరిగే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వ యంత్రాంగం స్పందించి తక్షణమే మరో 108 వాహనం అందుబాటులోకి తేవాలని, ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పని చేస్తున్న వైద్య సిబ్బందికి ప్రభుత్వం భద్రత కల్పించాలని హుస్నాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి :దుర్గామాతకు బోనాలు సమర్పించిన మంత్రి అల్లోల