ఓ వైపు కరోనా, మరోవైపు సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న తరుణంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు అందుబాటులో లేకపోవడం పట్ల స్థానిక ఎంపీటీసీ నిరసనకు దిగారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు , ఆస్పత్రి సిబ్బంది అందుబాటులో లేకపోవడం దారుణమని మిరుదొడ్డి ఎంపీటీసీ సుతారి నర్సింహులు అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు అందుబాటులోకి ఉండడం లేదన్న స్థానికుల సమాచారం మేరకు ఎంపీటీసీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక్క ఫార్మసిస్ట్ ,ఒక నర్సు తప్ప ఎవరూ లేకపోవడం పట్ల ఆయన నిరసన తెలియజేశారు.
అందుబాటులో లేని వైద్యులు.. ఎంపీటీసీ నిరసన! - సిద్ధిపేట తాజా వార్తలు
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు అందుబాటులో లేకపోవడం గమనించిన ఎంపీటీసీ ఆస్పత్రి ముందు నిరసనకు దిగారు. చికిత్స కోసం వచ్చిన రోగులకు ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయని.. కరోనా పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీ డిమాండ్ చేశారు.
వైద్యులు, ఇతర సిబ్బంది ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల చికిత్స కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనిన్నారు. చికిత్స కోసం వచ్చిన రోగులు సైతం.. చాలారోజులుగా వైద్యులు, సిబ్బందికి బదులు ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయని వాపోయారు. వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్ల రోగులు ఫార్మాసిస్ట్ ఇచ్చిన మాత్రలు తీసుకొని వెళ్లిపోతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధ్యత మరిచి, సమయపాలన పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్య సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీ, స్థానికులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యుల ఆందోళన