తెలంగాణ

telangana

ETV Bharat / state

మెతుకు సీమను ముద్దాడిన గోదారమ్మ

సిద్దిపేట జిల్లాకు గోదారమ్మ తరలివచ్చింది. రంగనాయకసాగర్‌లోకి గోదావరి జలాలను ఎత్తిపోసే చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు నాలుగు మోటార్లను ప్రారంభించారు. రిజర్వాయర్‌ వద్ద నీటికి జలహారతి ఇచ్చారు.

ranganayakasagar
ranganayakasagar

By

Published : Apr 24, 2020, 1:15 PM IST

Updated : Apr 24, 2020, 3:08 PM IST

నీళ్లులేక నోళ్లు తెరిచిన బీడు భూములను తడిపేందుకు కాళేశ్వర గంగ తరలివచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రంగనాయక్‌సాగర్‌లో గోదావరి జలసవ్వడి మొదలైంది. అన్నపూర్ణ జలాశయం నుంచి జలాలను రంగనాయకసాగర్‌లోకి విడుదల చేసేందుకు నాలుగుమోటార్లను మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం రంగనాయక సాగర్‌ రిజర్వయర్‌లో గోదారమ్మకు జలహారతులు ఇచ్చారు.

పేరు ఇలా వచ్చింది

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సిద్దిపేటలో నిర్మించిన రంగనాయక సాగర్ జిల్లాలోనే మొదటి ప్రాజెక్ట్. దీనికి సమీపంలో రంగనాయక స్వామి ఆలయం ఉండటం వల్ల.. ఆ స్వామి పేరు పెట్టారు. మూడు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ద్వారా సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల పరిధిలోని లక్షా పది వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది. ఇక్కడి నుంచి మల్లన్నసాగర్‌కు గోదావరి జలాలు చేరనున్నాయి. సిద్దిపేట పట్టణానికి అతి సమీపంలో 2,300 ఎకరాల విస్తీర్ణంలో రూ.3,300కోట్లు ఖర్చు చేసి రంగనాయక సాగర్‌ ప్రాజెక్టును పూర్తి చేశారు. 8 కిలోమీటర్ల 650మీటర్ల పోడవైన కట్టను ఇందుకోసం నిర్మించారు.

రెండో భారీ మోటార్ల వినియోగం

రంగనాయక సాగర్ సాంకేతిక అద్భుతమని చెప్పొచ్చు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో రెండో భారీ మోటార్లను ఇక్కడ వినియోగిస్తున్నారు. 134.5 మెగావాట్ల సామర్థ్యం ఉన్న నాలుగు మోటార్లను ఇక్కడ బిగించారు. ఒక్కో మోటారు 24గంటల వ్యవధిలో 0.25 టీఎంసీల నీటిని ఎత్తిపోయగలదు. నాలుగు మోటార్లను నడిపిస్తే కేవలం 3 రోజుల్లో రంగనాయకసాగర్‌ నిండుతుంది. భూమిలోపల భారీ సర్జిపూల్ నిర్మించారు. 65 మీటర్ల లోతు, 20 మీటర్ల వెడల్పు, 110 మీటర్ల పొడవుతో ఆసియాలోని భారీ భూగర్భ సర్జిపూళ్లలో ఇది ఒకటి.

ఇది మరో ప్రత్యేకత

సిద్దిపేట పట్టణానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో నిర్మించిన ఈ ప్రాజెక్టులో ఒక్క ఇళ్లు కూడా ముంపునకు గురికాకపోవడం మరో ప్రత్యేకత. ప్రాజెక్టు నిర్మాణం కోసం సుమారు 2,300ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారందరికీ.. ఇప్పటికే పునరావాస ప్యాకేజీ అందించారు. ప్రాజెక్టులో చేపలు పట్టుకునే హక్కులు అదనంగా కల్పించారు.

ఇదీ చూడండి:గోదావరి జలాలతో పురిటి గడ్డ పునీతమైంది: హరీశ్ రావు

Last Updated : Apr 24, 2020, 3:08 PM IST

ABOUT THE AUTHOR

...view details