సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లో నిర్మించిన రంగనాయక సాగర్ నుంచి కుడి, ఎడమ కాలువల్లోకి శనివారం గోదావరి జలాలను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు విడుదల చేశారు. ఫలితంగా జలాశయం నుంచి గోదారమ్మ ఉరకలెత్తింది. ఎడమ ప్రధాన కాలువలోకి హరీశ్ సహా ప్రజాప్రతినిధులు, అధికారులు పుష్పాలు చల్లి పూజలు జరిపారు. దాదాపు 8 కిలోమీటర్ల మేర కుడి ప్రధాన కాలువను పైప్‌లైన్ పద్ధతిలో నిర్మించారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి, మిట్టపల్లి వద్ద ప్రత్యేక వ్యవస్థ ద్వారా పైప్‌ల నుంచి నీటిని బహిరంగ కాలువలోకి మంత్రి నీటిని వదిలారు. సిద్దిపేట నియోజకవర్గంలోని కాల్వల ద్వారా నీరు ప్రవహించడం వల్ల హరీశ్‌రావు ఆనంద పారవశ్యంలో మునిగి తేలారు.
ఇదిలా ఉండగా.. రంగనాయకసాగర్ హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్యాకేజీ -12 (మల్లన్నసాగర్) కాలువలోకి గోదావరి నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీ హరిరాం వదిలారు. ప్రయోగ పరిశీలన కోసం విడుదల చేసిన ఈ జలం తొగుట మండలం తుక్కాపూర్‌లోని సొరంగంలో ఉన్న మల్లన్నసాగర్ సర్జిపూల్‌ను చేరింది. రంగనాయకసాగర్ నీటి మట్టం ఒక టీఎంసీకి చేరడం వల్ల జలకళ మరింతగా పెరిగింది.
కాలంతో నిమిత్తం లేకుండా సాగు..
గోదారమ్మ.. కాలువల వెంబడి బిరబిరా పరుగులు తీస్తుంటే అన్నదాతల కళ్లల్లో ఆనందబాష్పాలు రాలుతున్నాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కాల్వలకు నీరు విడుదల చేసిన అనంతరం.. ఈరోజు కోసం జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇది కలా.. నిజమా? అన్నట్లుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఈ ప్రాంతంలో కరవు అనే పదం నిఘంటువు నుంచి తొలగిపోనుందని చెప్పారు.
తెలంగాణలో ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడదనుందన్నారు. విద్యుత్తు సరఫరా, కాలంతో నిమిత్తం లేకుండా సాగు చేసే రోజులు వచ్చాయన్నారు. ఇక నుంచి కాలిపోయే మోటార్లు, నియంత్రికలు కనిపించవన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో కీలక భూమిక పోషించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఇంజినీర్లు, కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు.