తెలంగాణ

telangana

ETV Bharat / state

HARISH RAO: ప్రతి ఒక్కరికి టీకాలు వేయించే బాధ్యత మీదే: హరీశ్​ రావు - గజ్వేల్ మండలంలో హరీశ్​ రావు

ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్లి టీకాలు ఇప్పించాల్సిన బాధ్యత వార్డు మెంబర్లదేనని మంత్రి హరీశ్​ రావు ఆదేశించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను ఆయన ప్రారంభించారు.

Minister harish Rao
Minister harish Rao

By

Published : Jul 5, 2021, 5:32 PM IST

గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి హైదరాబాద్​లో కూర్చుని మాట్లాడే వాళ్లకు ఏం తెలుస్తుందని రాష్ట్ర మంత్రి హరీశ్​ రావు ఎద్దేవా చేశారు. గ్రామాల్లోకి వచ్చి చూస్తే అసలు జరిగిన ప్రగతి కనిపిస్తుందని తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్​లో పర్యటించిన ఆయన రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. యాసంగి పంట సీజన్​లో ప్రతి ఎకరాకు సాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్​దేనన్నారు.

Minister harish Rao

గతంలో కాలిపోయిన మోటార్లు, పేలిపోయే ట్రాన్స్​ఫార్మర్లు పొలాల్లో దర్శనమిచ్చేవని మంత్రి ఎద్దేవా చేశారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ హయాంలో కాళేశ్వరం నీళ్లతో తెలంగాణ నిండుకుండలా తయారైందన్నారు. ఎండకాలంలోనూ సైతం కాళేశ్వరం నీళ్లు తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. తెరాస హయాంలో రైతన్నలకు సాగునీటికి పూర్తి భరోసా లభించిందని మంత్రి పేర్కొన్నారు.

కరెంటు లేకుండా కాలువల నీటి ద్వారా రెండు పంటలు పండించుకునే సమయం ఆసన్నమైందన్నారు. మరో రెండు నెలల్లో మల్లన్న సాగర్​లోకి నీళ్లు వచ్చి చేరతాయని మంత్రి అన్నారు. వచ్చే నెల నుంచే 57 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వృద్ధాప్య పింఛను ఇస్తామని తెలిపారు. ఎన్నడూ లేని విధంగా అహ్మదీపుర్ గ్రామంలో రూ.6.25 కోట్ల నిధులతో 14 రకాల అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నట్లు హరీశ్​రావు తెలిపారు.

ఇంటింటికి తిరిగి టీకా ఇప్పించాలే

ఓట్ల కోసం ఇంటింటికి తిరిగి న వార్డు మెంబర్లు.. ఇప్పుడు కూడా ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరికి టీకా వేయించే బాధ్యతను తీసుకోవాలని మంత్రి హరీశ్​ రావు సూచించారు. కొవిడ్ నివారణకు మాస్కు, టీకానే రక్షణ అని మంత్రి వివరించారు. గ్రామంలో 96 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. గజ్వేల్ నియోజక వర్గ పరిధిలోని 44 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. గజ్వేల్ సమీకృత కార్యాలయ భవనంలోని సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నిరుపేదలకు సాయం ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుందని చెప్పారు. చెక్కులను వెంటనే తమ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులకు హరీశ్​ రావు సూచించారు.

మా రైతును అడుగండి యాసంగి పంటలో ఎండిపోయే 500 ఎకరాలను ఈ ఒక్క ఊర్లో కేసీఆర్ కాపాడిండా లేదా ఊర్లోకి వచ్చి మాట్లాడితే మీకు తెలుస్తది. మీరు హైదరాబాద్​లో రూముల్లో కూర్చుంటే మీకేం తెలుస్తది. చేసినా పని గురించి మీరు చేసినా మొఖమైతే మీకు తెలుస్తుండే. మీరు చేసింది కాదాయే.. కనీసం చేసినా దాన్ని గురించి కూడా హర్షించే మంచి మనసు కూడా మీకు లేదు. ఇంకా చేసుకోవాలే. ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని చేసుకుంటా వస్తున్నాం. మా వార్డు మెంబర్లు ఓట్లప్పుడు ఇంటిఇంటికి పోయి దండం పెట్టిర్రు. ఇప్పుడు అదే వార్డు మెంబర్లకు చెబుతున్నా ఇంటిఇంటికి పోయి దొరకబట్టి టీకాలు ఏపియ్యాలే. వార్డు మెంబర్లు ఓట్లప్పుడు తిరుగుడు కాదు ఇప్పుడు తిరగాలి. ఇంటిఇంటికి పోయి టీకా పడ్డదా లేదా తెలుసుకోవాలే. పడలేదంటే వారిని పట్టుకుపోవాలే. మా ఆశమ్మలు, మా వార్డు మెంబర్లు, మా ఏఎన్​ఎంలు అందరూ దయచేసి తిరిగి ప్రతి ఒక్కరికి టీకా వేయించాలని కోరుతున్నా.- హరీశ్​ రావు, ఆర్థికశాఖ మంత్రి

HARISH RAO

ఇదీ చూడండి:మత్స్యకారులకు బాసటగా..సంచార చేపల విక్రయ వాహనాలు అందజేత

ABOUT THE AUTHOR

...view details