పట్టణ ప్రగతిలో భాగంగా సిద్ధిపేటలోని స్వచ్ఛబడి(Swacha Badi)ని మంత్రి హరీశ్‌రావు(Minister Harish Rao) ఆకస్మికంగా పరిశీలించారు. చెత్త నుంచి సంపదను ఎలా సృష్టించవచ్చో ప్రజలకు తెలిపేందుకే స్వచ్ఛబడిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. చెత్తతో తయారైన సేంద్రియ ఎరువుల(Organic fertilizers)ను మంత్రి పరిశీలించారు. సేంద్రీయ-ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేసిన కూరగాయల తోటను సందర్శించారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో రోజు 40 టన్నుల చెత్త వస్తుందని... ఇలా అయితే పట్టణ ప్రజల ఆరోగ్యం పాడవుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే చెత్తపై అవగాహన కల్పిస్తూ... చెత్తనుంచి ఎరువులు ఎలా తయారు చేసుకోవాలో నేర్పుతామని వెల్లడించారు. అందరూ స్వచ్ఛ బడికి వచ్చి చెత్తను ఎరువులుగా ఎలా మార్చుకోవాలో నేర్చుకోవాలని సూచించారు.
వ్యర్థాల నుంచి గ్యాస్ తయారీ..
పసి పిల్లల నుంచి పండు ముసలి వరకూ స్వచ్ఛబడి చెత్త గురించి పాఠాలు నేర్పుతుందని వెల్లడించారు. చెత్తను సరైన విధంగా డిస్పోజ్ చేయకపోతే ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఇక్కడ చెప్తారని వెల్లడించారు. చెత్తను ఆదాయ వనరుగా మార్చి.. చెత్త రహిత పట్టణంగా మార్చే దిశగా అడుగులేస్తున్నామన్నారు. వ్యర్థాల ద్వారా గ్యాస్ తయారు చేసేలా ప్రణాళికలు రచిస్తున్నామని... ఈ ఆలోచనతో ముందుకెళ్తున్నామని తెలిపారు. త్వరలోనే చెత్త ద్వారా గ్యాస్ వెలికి తీసే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు.
రేపటి భవిష్యత్తుకు చక్కటి ఆరోగ్యాన్ని అందించేలా అందరూ కృషి చేయాలని మంత్రి కోరారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని బహుమతిగా, ఆస్తిగా ఇవ్వాలన్నారు. ఆరోగ్య సిద్ధిపేట, ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 39వ మున్సిపల్ వార్డులో మిద్దెతోటలు పెంచుతున్న దంత వైద్యులు రామస్వామిని మంత్రి హరీశ్‌రావు(Minister Harish Rao) అభినందించారు.