Harish Rao inaugurated dubbaka hospital: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో వంద పడకల ప్రాంతీయ ఆస్పత్రిని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. కార్పొరేట్ స్థాయిలో ఆస్పత్రి నిర్మాణం చేపట్టామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్క ఐసీయూ కేంద్రం కూడా లేదన్న మంత్రి.. తెరాస ప్రభుత్వం వచ్చాకే ఐసీయూ కేంద్రాలు వచ్చాయని వెల్లడించారు. దుబ్బాకలో వంద పడకలతో ఆస్పత్రి ఏర్పాటు చేశామన్న మంత్రి హరీశ్.. త్వరలోనే ఐసీయూ పడకలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయి..
harish on kcr kit: కేసీఆర్ కిట్ పథకంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 52 శాతానికి పెరిగాయని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. దుబ్బాకలో రక్తనిధి కేంద్రం ఏర్పాటు చేయాలని ఎంపీ, ఎమ్మెల్యే కోరారని.. త్వరలోనే దానిని కూడా మంజూరు చేస్తామన్నారు. నవజాత శిశు సంరక్షణ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి హరీశ్ హామీ ఇచ్చారు. వీటితో పాటు మంచి వైద్యులను కూడా నియామకం చేస్తామన్నారు. దుబ్బాక ఆస్పత్రిని 30 పడకల నుంచి వంద పడకలకు పెంచుకున్నామన్నారు. ఇప్పటివరకు హైదరాబాద్, సిద్దిపేట కేసీఆర్ నగర్‌లోనే బస్తీ దవాఖానాలు ఉన్నాయన్న మంత్రి.. దుబ్బాక పట్టణానికి కూడా బస్తీ దవాఖానా మంజూరు చేస్తామన్నారు.
ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలి..
Harish Rao on covid: కొవిడ్ నుంచి బయటపడాలంటే మూడే మార్గాలున్నాయని మంత్రి హరీశ్ స్పష్టం చేశారు. వ్యాక్సిన్, మాస్క్, భౌతికదూరం.. వీటి ద్వారానే మనం బయటపడగలమన్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ తీసుకోవాలని మంత్రి సూచించారు. ఇతర దేశాల్లో బూస్టర్ డోస్ కూడా వేస్తున్నారని... ఇక్కడ బూస్టర్ డోస్ కోసం కేంద్రానికి లేఖ రాశామన్నారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే బూస్టర్ డోస్ కూడా వేస్తామన్నారు.