Minister Harish Rao: జాతీయస్థాయిలో అన్నింట సిద్దిపేట ఆదర్శంగా ఉందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే ప్రగతి పది కాలల పాటు నిలబడుతుందని పేర్కొన్నారు. నర్సాపూర్ చెరువు వద్ద మురుగు నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని ఎంపీ ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. 300కోట్ల రూపాయలతో సిద్దిపేట పట్టణంలో భూగర్భ మురుగు నీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చేసి ఇస్తే సిద్దిపేట ఎప్పటికీ శుద్ధిపేటగా నిలిచిపోతుందని ప్రజలకు సూచించారు. మండుటెండల్లోనూ చెరువులు నిండుగా ఉన్నాయి. రాష్ట్రంలో నీటికి విద్యుత్‌కు కొరత లేదని హరీశ్ రావు స్పష్టం చేశారు.
"నేను కాలనీలో పర్యటించినప్పుడు ఇంటి ముందు మురికి నీరు నిలుస్తుందా అని మిమ్మల్ని అడిగాను. మీరే చెప్పారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. అందుకే భూగర్భ జల శుద్ది కేంద్రాన్ని పెట్టుకున్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా శుద్ది చేసి నీళ్లను నర్సాపూర్ చెరువులోకి పంపిస్తున్నాం. గతంలో చింతల్ చెరువు దగ్గర ప్రారంభించుకున్నాం. ఇవాళ నర్సాపూర్ చెరువు దగ్గర మురుగు నీటి శుద్ధికరణ కేంద్రాన్ని ప్రారంభించాం. దీనికి మీ అందరి సహకారం ఉండాలి. పందులు, దోమలు, ఈగలు లేకుండా పట్టణాన్ని బాగు చేసుకుంటున్నాం. సిద్దిపేట ఈరోజు ఆదర్శంగా ఉందంటే మీ అందరి సహకారమే. విద్యలో, వైద్యంలోను ,ఆటలలో ఆదర్శంగా ఉంది. ఫలితంగా 18 జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు సిద్దిపేటకు వచ్చాయి."