gouravelli project oustees protest : సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద... జలయజ్ఞంలో భాగంగా నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టు 15 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఒకటిన్నర టీఎంసీల సామర్థ్యంతో పనులు ప్రారంభించారు. స్వరాష్ట్రం వచ్చాక...పునరాకృతిలో భాగంగా ఎనిమిదిన్నర టీఎంసీలకు పెంచారు. ప్రస్తుతం గౌరవెల్లి ప్రాజెక్టు 95 శాతం పనులు పూర్తికాగా తోటపల్లి నుంచి రేగొండ పంప్‌హౌస్ ద్వారా గోదావరి జలాలను గౌరవెల్లి ప్రాజెక్టులోకి ట్రయల్‌రన్ చేస్తామన్న మంత్రి హరీశ్‌రావు ప్రకటనతో ఆందోళనలు ఊపందుకున్నాయి.
ఇంకా పరిహారం అందని భూ నిర్వాసితులు పనులు అడ్డుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ట్రయల్‌రన్ చేసిన నీటిని కాల్వ ద్వారా పంపాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు కాల్వనిర్మాణానికి చేస్తున్న సర్వేను నిర్వాసితులు అడ్డుకున్నారు. విధులకు ఆటంకం కలిగిస్తున్నారన్న అధికారుల ఫిర్యాదుతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీఛార్జి చేయడం, అరెస్ట్‌లతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. నిర్వాసితులు చేపట్టిన హుస్నాబాద్ బంద్‌ను తెరాస నేతలు ప్రతిఘటించడంతో నిర్వాసితులు నిరసనల హోరు పెంచారు.