సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి, సైదాపూర్, చిగురుమామిడి, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. బోర్లు, బావులలో నీటి లభ్యత లేక వందల ఎకరాల్లో వరి పంటలు ఎండిపోతున్నాయి. ప్రస్తుత రబీ సీజన్లో హుస్నాబాద్ నియోజకవర్గంలోని రైతులు కొన్ని వందల ఎకరాల్లో వరి సాగు చేశారు. నాటు వేసే ముందు బావుల్లో నీరు పంటకు సరిపోయే విధంగా ఉందని వరినాట్లు వేశారు. అయితే ఈసారి వర్షాలు సాధారణం కంటే తక్కువ కురిశాయి. ప్రస్తుతం వరి పంట పొట్ట దశకు చేరుకుంది.
పంట చేతికొచ్చే సమయంలో పంటలు ఎండిపోతుంటే రైతులు దిగులుతో చూస్తూ ఉండడం తప్ప ఏమి చేయలేక పోతున్నారు. మరో 15, 20 రోజుల్లో పంట చేతికి వచ్చే దశలో సాగునీరు లేక ఎండిపోతుండడం వల్ల రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎకరానికి 25 వేల నుంచి 30 వేల పెట్టుబడి పెట్టి పంట చేతికి వచ్చే సమయంలో ఎండిపోవడం చూసి ఏమి చేయలేక కొంతమంది రైతులు గొర్రెలను మేపుతున్నారు. కొంతమంది రైతులు పశువులను మేపుతున్నారు. కొంతమంది రైతులు అప్పులు చేసి బోర్లు వేయించినా.. ఫలితం లేక అప్పుల పాలయ్యారు.