ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని మగ్దుంపూర్ గ్రామ పరిధిలో మొదటి ఆయిల్ పామ్ మొక్కను మంత్రి హరీశ్ రావు నాటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రైతుల జీవితాలు బాగు పడతాయని... ఆనాడు కేసీఆర్ చెప్పిన మాట నేడు నిజమైందని పేర్కొన్నారు. కాళేశ్వరం జలాలతో రాష్ట్రంలో సాగుభూమి పెరిగిందని తెలిపారు. పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను తలదన్నే విధంగా... భూమికి బరువైన పంట పండిందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ధాన్యం కొనుగోళ్లు చేస్తలేదని... కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే మద్దతు ధరతో ధాన్యం కొనుగోళ్లు చేస్తోందని పేర్కొన్నారు.
ప్రతి ఏటా మన దేశంలో 90 వేల కోట్ల పామాయిల్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. దీనిని నియంత్రించడం కోసం మన దేశం 70 లక్షల ఎకరాల్లో పామాయిల్ తోటలు సాగు చేయాలని అన్నారు. పామాయిల్ సాగు చేయడం వలన వచ్చే లాభాలను సవివరంగా వివరించారు. పామాయిల్ కు బహిరంగ మార్కెట్లో పుష్కలమైన డిమాండ్ ఉందని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర అందించేలా.. అన్నిరకాల ప్రోత్సాహకాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.