దుబ్బాక ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి గెలుపు కోసం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విస్తృతంగా పర్యటించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో గెలిచేందుకు తెరాస, భాజపాలు కొత్త నాటకాలకు తెరతీశాయని విమర్శించారు. ప్రచారంలో భాగంగా చీకుడు గ్రామంలో యువకులతో కలిసి ఉత్తమ్ సరదాగా కాసేపు వాలీబాల్ ఆడారు.
దుబ్బాకలో తెరాస, భాజపా నాటకాలు : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి - టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి
దుబ్బాక ఉపఎన్నికలో తెరాస, భాజపాలు నాటకాలాడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
"దుబ్బాకలో అన్నదమ్ములు హరీశ్‌రావు, రఘునందన్‌రావు కలిసి నాటకాలాడుతున్నారు. దుబ్బాక అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డిని గెలిపించండి. తెరాసకు అభ్యర్థి ఎవరో తెలియక తికమక పడుతున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగారెడ్డికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు. రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యోగాలు, రుణమాఫీ, రెండు పడకల ఇళ్లు ఏమయ్యాయి. హస్తం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే దుబ్బాకను అభివృద్ధి పథంలో నడిపిస్తాం."- ఉత్తమ్‌కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు