సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆరబెట్టిన ధాన్యాన్ని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు పరిశీలించారు. రైతులు పడుతున్న అవస్థలను అడిగి తెలుసుకున్నారు. గత 15 రోజులుగా మార్కెట్ యార్డులో ధాన్యాన్ని ఆరబెట్టి తిండి, తిప్పలు లేకుండా రైతులు పడుతున్న బాధలను చూసి ప్రభుత్వంపై రఘునందన్‌రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి మాట విని సన్నాలు పండించిన రైతులకు సున్నాలు పెడుతున్నారని ఆయన అన్నారు. 'రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన ఎవుసం' నిలువదని ఎన్నో సార్లు చెప్పిన కేసీఆర్.. రైతులు పండించిన సన్నాల విషయంలో ఇన్ని రోజులుగా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.
సన్నాలు పండించిన రైతులకు సున్నాలు పెడుతున్నారు: రఘునందన్‌రావు - siddipet district news
ముఖ్యమంత్రి కేసీఆర్ మాట విని సన్నరకం వడ్లు పండించిన రైతులకు కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.3600 కల్పించి వారిని ఆదుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేనియెడల భాజపా తరఫున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
దొడ్డురకం ధాన్యం ఎకరాకు 40 క్వింటాళ్లు పండించే రైతులకు... సన్నాలు 15 క్వింటాళ్ల దిగుబడి రావడం వల్ల రైతులకు పెట్టుబడులు రాక అప్పుల పాలై ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉందన్నారు. ఇటీవలే దుబ్బాక నియోజకవర్గంలో ఓ రైతు ప్రభుత్వం మాట విని సన్నాలు పెట్టినందుకు కనీసం కూళ్లు మిగలవనే బెంగతో వరికి నిప్పు పెట్టారని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సన్నాల విషయంలో రూ.3600కు తగ్గకుండా మద్దతు ధర కల్పించాలని, లేనియెడల భాజపా పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధమవుతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇవీ చూడండి: సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మంత్రివర్గం భేటీ