తెలంగాణ

telangana

ETV Bharat / state

దుబ్బాక ఉప ఎన్నికలో 82.61 శాతం పోలింగ్.. గతం కంటే 3.63% తక్కువ - dubbaka election news

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. కరోనా నేపథ్యంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్‌ భారతి హొళికెరితో పాటు ఉన్నతాధికారులు... ఎన్నికల సరళిపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీపీ జోయెల్ డేవిస్ శాంతి భద్రతలు పర్యవేక్షించారు.

dubbaka by election polling complete and counting on october 10
దుబ్బాక ఉప ఎన్నికలో 82.61 శాతం పోలింగ్.. గతం కంటే 3.63% తక్కువ

By

Published : Nov 3, 2020, 6:00 PM IST

Updated : Nov 4, 2020, 11:04 AM IST

తెరాస ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో ఖాళీ అయిన దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు పోలింగ్ ముగిసింది. ఎమ్మెల్యే స్థానికి పోటీలో నిలిచిన 23 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నియోజకవర్గం ప్రజలు ఈవీఎంలల్లో నిక్షిప్తం చేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కాగా... ఆరంభంలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. అందుబాటులో ఉన్న సాంకేతిక సిబ్బంది సమస్యను పరిష్కరించి పోలింగ్‌ను కొనసాగించారు. ఉదయం 9 గంటల వరకు 12.74 శాతం పోలింగ్ నమోదైంది. 11 గంటల వరకు 34.33 శాతానికి పెరగగా.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 55.52 శాతం పోలింగ్‌ శాతం నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 71.10శాతం, 4గంటలకు వరకు 78.12, సాయంత్రం 5 వరకు 81.44 శాతం పోలింగ్ నమోదు కాగా మొత్తంగా 82.61 శాతం పోలింగ్ నమోదయింది. ఉపఎన్నిక కోసం నియోజకవర్గవ్యాప్తంగా 315 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొవిడ్‌ దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలతో పాటు.. గర్భిణులు, దివ్యాంగులకు ప్రత్యేక వరుసలు ఏర్పాటు చేశారు. సామాన్య ప్రజలకు సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ ముగియగా... అనంతరం గంట పాటు కరోనా బాధితులు పీపీఈ కిట్లు ధరించి ఓటు వేశారు.

ఆరెపల్లిలో స్వల్ప ఉద్రిక్తత

పోలింగ్‌ సరళిని ఎప్పటికప్పుడు ఎన్నికల, పోలీస్ ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ లచ్చపేటలో పర్యటించి.. పోలింగ్‌ పరిస్థితిని పరిశీలించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోళికేరి, సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ ఎప్పటికప్పడు పరిస్థితులను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలతో కలిపి మొత్తం 2 వేల మంది బందోబస్తులో పాల్గొన్నారు. సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన చోట అదనపు బలగాలు, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. రాయపోల్‌ మండలం ఆరెపల్లిలో 20 నిమిషాల పాటు ఈవీఎంలు మొరాయించాయి. కొంతమంది పోలింగ్‌ కేంద్రంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. కొత్తపల్లిలో రోడ్లపై ప్రచారం చేస్తున్న పలువురిని పోలీసులు చెదరగొట్టారు. చెదురుమొదురు ఘటనలు మినహా.. పోలింగ్‌ ప్రశాంత వాతావరణంలో పూర్తికావడంపై పోలీసులు సంతోషం వ్యక్తం చేశారు. పోలింగ్‌ అనంతరం ఘర్షణలు జరగకుండా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు సిద్దిపేట సీపీ జోయల్‌ డేవిస్‌ తెలిపారు. స్ట్రాంగ్‌ రూంల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటుచేశామని వివరించారు.

ఈ నెల10న ఫలితాలు

దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలో 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. తెరాస నుంచి దివంగత రామలింగారెడ్డి సతీమణి సుజాత, భాజపా నుంచి రఘునందన్‌రావు, కాంగ్రెస్‌ నుంచి చెరుకు శ్రీనివాస్‌ రెడ్డి పోటీలో ఉన్నారు. తెరాస అభ్యర్థి సుజాత తన స్వగ్రామమైన చిట్టాపూర్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. తొగుట మండలం తుక్కాపూర్‌లో చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఓటు వేశారు. భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు.. దుబ్బాక మండలం బొప్పాపూర్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తన స్వగ్రామమైన దుబ్బాక మండలం పోతారంలో కుటుంబసభ్యులతో కలిసి ఓటువేశారు. హోరాహోరీగా సాగిన ప్రచారంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉపఎన్నికపై ఆసక్తి పెరిగింది. ప్రధాన రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని.... గెలుపే లక్ష్యంగా ఎత్తుకు పైఎత్తులు వేశాయి. ఉత్కంఠబరితంగా మారిన దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలు ఈ నెల10న వెలువడనున్నాయి.

ఇదీ చూడండి:దుబ్బాకలో సాయంత్రం 5 వరకు 81.44 శాతం పోలింగ్

Last Updated : Nov 4, 2020, 11:04 AM IST

ABOUT THE AUTHOR

...view details