తెలంగాణ

telangana

ETV Bharat / state

దుబ్బాక గెలుపుతో కమలదళంలో కొత్త ఉత్సాహం - రఘునందన్​ రావు తాజా వార్తలు

రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా మారిన దుబ్బాక ఉపఎన్నికలో భాజపా విజయం సాధించింది. ఆధ్యంతం ఉత్కంఠగా సాగిన పోరులో గులాబీపై కమలం పై చేయి సాధించింది. రౌండ్​ రౌండ్​కు ఆధిక్యం మారిన ఓట్ల లెక్కింపులో చివరికి రఘునందన్​ రావునే విజయం వరించింది. మొదట రఘునందన్ రావు, మధ్యలో సుజాత చివరికి భాజపానే గెలిచి నిలిచింది. ​

bjp won in dubbaka by election in siddipeta district
దుబ్బాకలో దుమ్ములేపిన భాజపా

By

Published : Nov 10, 2020, 5:17 PM IST

Updated : Nov 10, 2020, 5:31 PM IST

దుబ్బాక ఉపఎన్నికలో కమలదళం సత్తాచాటింది. భాజపా అభ్యర్థి రఘునందన్‌ రావు విజయదుందుబి మోగించారు. నువ్వా-నేనా అన్నట్లు సాగిన పోరులో భాజపాను విజయం వరించింది. అధికార పక్షం తెరాస అనూహ్యంగా పరాభవం చవిచూసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రోడ్‌ మ్యాప్‌గా దుబ్బాక ఉపఎన్నికను అభివర్ణించిన కమలం నేతలు పక్కా ప్రణాళికతో విజయం సాధించారు. ప్రధానంగా యువత ఓట్లను ఆకర్షించడంలో భాజపా నేతలు సఫలమయ్యారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలకు ముందు దుబ్బాక విజయం కమలదళంలో నూతనోత్సాహం నింపింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నేతృత్వంలో ఎదుర్కొన్న తొలి ఉపఎన్నికలో విజయం సాధించి భాజపాలో జోష్‌ నింపారు. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి ఉపఎన్నిక ఏదైనా తెరాసకు విజయం నల్లేరుపై నడకలాగే ఉండేది. కానీ, దుబ్బాక ఫలితం గులాబీ దళాన్ని తీవ్ర నిరాశలో పడేశాయి.

కమలం శ్రేణుల సంబురాలు

దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలు భాజపాకు బూస్ట్‌ ఇచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా కమలం శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నాయి. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. కార్యకర్తలు, పార్టీ నేతలు బండి సంజయ్‌ని అభినందనలతో ముంచెత్తారు. ఈ విజయం రానున్న ఎన్నికల్లో భాజపా సత్తా చాటుతుందనేందుకు సంకేతమని నినాదాలు చేశారు. ఇదే స్ఫూర్తిని గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లోనూ ప్రదర్శిస్తామని కమలం శ్రేణులు వ్యాఖ్యానించాయి. సమష్టి కృషి, కార్యకర్తల అంకితభావానికి దుబ్బాక ఉపఎన్నికే నిదర్శనమని భాజపా నేతలు స్పష్టం చేశారు. అధికార పక్షం అవాస్తవాలు ప్రచారం చేసినా ఫలితం తమవైపే వచ్చిందని భాజపా నేతలు హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:విజయాలకు పొంగిపోము.. అపజయాలకు కుంగిపోము: కేటీఆర్‌

Last Updated : Nov 10, 2020, 5:31 PM IST

ABOUT THE AUTHOR

...view details