భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర తొలిదశ ముగింపు సభ కాసేపట్లోె సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరుగనుంది. 36 రోజులుగా కొనసాగిన యాత్ర ముగింపు కోసం భారీ బహిరంగసభను ఏర్పాటు చేశారు. ఈ సభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో పాటు ఇతర భాజపా పార్టీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. దీంతో పట్టణం మొత్తం కాషాయ జెండాలతో రెపరెపలాడుతోంది. ముగింపు సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు హాజరు కానున్నారు.
ఐదు చోట్ల పార్కింగ్...
పోలీసులు పట్టణంలోని ఐదు ప్రాంతాలను వాహనాల పార్కింగ్‌కు కేటాయించారు. ఎల్కతుర్తి మార్గంలో వచ్చే వారికి పట్టణం ప్రారంభంలోనే ఓ ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేశారు. కరీంనగర్ నుంచి వచ్చే వారికి సెయింట్ జోసెఫ్ పాఠశాల వద్ద, మిగతా వారికి పట్టణంలోని తిరుమల గార్డెన్, హెచ్‌పీ పెట్రోల్ పంపు, ఆర్టీసీ డిపో వద్ద ఉన్న ఖాళీ స్థలాల్లో ఏర్పాటు చేశారు. 220 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు హుస్నాబాద్ ఏసీపీ సతీష్ వివరించారు. రోడ్‌షో నిర్వహించే సమయంలో.. ప్రయాణికుల రాకపోకల్లో ఇబ్బందులు తలెత్తకుండా.. దారి మళ్లింపు ఉంటుందని తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.
హుస్నాబాద్‌కు చేరిన పాదయాత్ర...
శుక్రవారం మధ్యాహ్నం హుస్నాబాద్ మండలంలోని పొట్లపల్లి నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించారు. పొట్లపల్లి, పందిళ్ల స్టేజీ మీదుగా హుస్నాబాద్‌కు చేరింది. పొలాల్లో పని చేస్తున్న వ్యవసాయ కూలీలతోపాటు హమాలీలు, గీతకార్మికులతో మాట్ల్లాడారు. పల్లెప్రకృతి వనం వద్ద పత్తిచేనులో భల్లునాయక్‌తండాకు చెందిన కూలీలు పనిచేస్తుండగా.. బండి సంజయ్ ఆరా తీశారు. తెరాస ప్రభుత్వం తమకు ఏమీ చేయలేదన్నారు. మౌనిక అనే యువతి.. తాను అగ్రికల్చర్ పాలిటెక్నిక్ పూర్తి చేసి ఉద్యోగం లేక కూలి పనికి వెళ్తున్నట్లు తెలిపింది. ప్రైవేటు ఉద్యోగం చేస్తానంటే ఇప్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదే గ్రామానికి చెందిన పదేళ్ల బాలుడు బానాల ప్రభు మానసిక వైకల్యంతో బాధ పడుతుండగా వైద్యఖర్చులు భరిస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు. పత్తి, రైస్‌మిల్లుల్లో పని చేసే హమాలీ కార్మికులు తమ సమస్యలు వివరించారు. అదే మార్గంలో ఉన్న తాటివనంలో గీతకార్మికులతో మాట్లాడి.. సరదాగా తాటి కల్లు తాగారు. అంతకుముందు పొట్లపల్లిలోని స్వయంభూ రాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.