సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నీట మునిగి తీవ్రంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ భాజపా ధర్నా నిర్వహించింది. ఎకరాకు రూ. 25 వేలు చొప్పున రైతులకు పరిహారం ఇవ్వాలని ఆర్డీఓ కార్యాలయం ఎదుట భాజపా నాయకులు డిమాండ్ చేశారు. గత ఆరేళ్ల నుంచి అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎలాంటి పరిహారమివ్వకుండా కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు విమర్శించారు. తాజాగా జరిగిన పంటనష్టంపై కూడా నిర్లక్ష్యం వహిస్తోందని మండి పడ్డారు.
కేంద్రం తీసుకొచ్చిన ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణలో అమలు చేయకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని శంకర్ బాబు దుయ్యబట్టారు. ఇప్పటికైనా కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.