Raghunandan rao: తనపై దాడికి యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని దుబ్బాక భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు కోరారు. హైదరాబాద్లో డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి ఆయన పోలీసులు వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేశారు. అధికారిక కార్యక్రమానికి పోలీసులు భద్రత కల్పించలేదని డీజీపీకి వివరించారు. ఈ సంఘటనపై విచారణ జరిపించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. ఆయన సానుకూలంగా స్పందించారని.. ఒకవేళ వారిపై చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ఆయన స్పష్టం చేశారు.
పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు:తన నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న తనపై భౌతికదాడికి యత్నిస్తే పోలీసులు అడ్డుకోలేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘ విద్రోహ శక్తులు తనపై కుట్ర పన్ని దాడికి యత్నిస్తే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడమే కాకుండా వారిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం దారుణమన్నారు. తాను ఫోన్ చేసి చెప్పినా కూడా సిద్దిపేట ఏసీపీ రక్షణ కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని గుడికందుల మార్కెట్ ప్రారంభోత్సవానికి వెళ్తే తెరాస కండువాలు వేసుకుని వచ్చి అడ్డుకున్నారని మండిపడ్డారు. తెరాస నేతలు తనను అడ్డుకునే ప్రయత్నం చేస్తే.. మహిళలు వారిపై తిరుగుబాటు చేశారని వెల్లడించారు.
పోలీసులు ఎవరి ఆదేశాలతో పనిచేస్తున్నారు?:తెరాస సమావేశాల్లో ఇతర పార్టీ నేతలు ఆందోళన చేస్తే పోలీసులు ఊరుకుంటారా రఘునందన్ రావు ప్రశ్నించారు. తెరాసకు, ఇతర పార్టీలకు ఒక న్యాయమా అని నిలదీశారు. ఎమ్మెల్యే వస్తున్నాడని పోలీసులకు తెలిసినా కూడా బందోబస్తు ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. మేము మిరుదొడ్డి పోలీసు స్టేషన్లో ఉంటే.. గేటు బయట తెరాస నేతలతో సిద్దిపేట ఏసీపీ సంప్రదింపులు జరిపారని మండిపడ్డారు. ఎమ్మెల్యేకు రక్షణ కల్పించలేని పోలీసులు.. కూల్చేసిన శిలాఫలకం కడుతుంటే 50 మందితో భద్రత కల్పించారని దుయ్యబట్టారు. శిలాఫలకం కూల్చిన వ్యక్తులను ఇంత వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదో సిద్దిపేట ఏసీపీ చెప్పాలని ప్రశ్నించారు. శిలాఫలకం కూల్చిన, నాపై దాడికి యత్నించిన వారిపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని నిలదీశారు. అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన తనపై శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.