తెలంగాణ

telangana

By

Published : Dec 21, 2020, 1:23 PM IST

Updated : Dec 21, 2020, 8:09 PM IST

ETV Bharat / state

జీవితాంతం గుర్తుండేలా ప్లాస్టిక్​ ప్రమేయం లేని పర్యావరణ పెళ్లి

ప్లాస్టిక్ నిత్యజీవితంలో భాగమైపోయింది. అది లేకుండా ఏ పని చేయలేని స్థితికి చేరుకున్నాం. పండుగలు.. వేడుకలైతే ప్లాస్టిక్ గుట్టలే. కానీ సిద్దిపేటకు చెందిన ఓ కుటుంబం తమ కూతురి పెళ్లి.. ప్లాస్టిక్ ప్రమేయం లేకుండా చేసి ఔరా అనిపించింది. పెళ్లి మండపం నుంచి వంటశాల మొదలగు అన్నింటిని పర్యావరణహితంగా మలిచారు. చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.

జీవితాంతం గుర్తుండేలా ప్లాస్టిక్​ ప్రమేయం లేని పర్యావరణ పెళ్లి
జీవితాంతం గుర్తుండేలా ప్లాస్టిక్​ ప్రమేయం లేని పర్యావరణ పెళ్లి

జీవితాంతం గుర్తుండేలా ప్లాస్టిక్​ ప్రమేయం లేని పర్యావరణ పెళ్లి

సిద్దిపేట పట్టణానికి చెందిన పర్యావరణ ప్రేమికుడు నేతి కైలాసం, భ్రమరాంబ తమ కూతురి వివాహం సంప్రదాయబద్ధంగా పర్యావరణహితంగా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆహ్వన పత్రిక నుంచి అతిథులకు ఇచ్చే బహుమతులు, భోజనాలు వరకు అన్నింటా ప్రకృతికి తమ వంతు సాయం అందేలా జాగ్రత్తలు తీసుకున్నారు. తులసి విత్తనాలతో తయారుచేసిన శుభలేఖలు పంచి బంధుమిత్రులను వివాహనికి ఆహ్వానించారు. ఒక రాత్రి నీటిలో నానబెట్టి మట్టిలో వేస్తే అందులోంచి తులసి మొక్కలురావడం ఈ శుభలేఖ ప్రత్యేకత.

జీవితాంతం గుర్తుండిపోయేలా...

పెళ్లికి కళ.. హంగు, ఆర్భాటం మొత్తం అలంకరణలోనే ఉంటుంది. జీవితాంతం గుర్తుండిపోయే వేడుకను వీలైనంత సుందరంగా తీర్చిదిద్దుకుంటారు. కానీ వీరు మాత్రం అలంకరణలో ప్లాస్టిక్ ఏ మాత్రం చోటు ఇవ్వలేదు. సహజమైన పువ్వులు, ఆకులు, పర్యావరణహితమైన వస్తువులతోనే కళ్యాణ వేదికను, మండపాన్ని తీర్చిదిద్దారు. చేనేత వస్త్రంపై సహజ రంగులతో బ్యానర్లు రాయించారు.

ఆరోగ్యకర భోజనం...

పెళ్లిలో మరో కీలకమైన అంశం భోజనాలు. కైలాసం దంపతులు తమ అతిథులకు అరటి ఆకులో రసాయనాలు లేని ఆరోగ్యకర భోజనాన్ని వడ్డించారు. మట్టి కప్పులు, గ్లాసులు, చెక్కతో చేసిన చెంచాలతో విందు ఏర్పాటు చేశారు. కేరళ నుంచి తెప్పించిన ప్రత్యేక ఆయుర్వేద మూళికలతో మరిగించిన నీటిని తాగడానికి అందించారు. చివరికి డైనింగ్ టేబుల్ మీద సైతం కాగితాన్నే పరిచారు.

ప్రత్యేక కానుకలు...

తమ కుమార్తె వివాహానికి వచ్చి ఆశీర్వదించిన బంధుమిత్రులందరికీ ప్రత్యేక కానుకలు అందించారు. ప్రతి ఒక్కరికి జనపనారతో తయారు చేసిన సంచి, గోఆర్క్ ఔషదాన్ని, సీడ్ బాల్స్, పండ్లు బహుమతిగా ఇచ్చారు. ఇందుకోసం చింత, రావి, మర్రి, జువ్వి వంటి విత్తనాలతో ప్రత్యేకంగా సీడ్ బాల్స్ తయారు చేయించారు. సీడ్ బాల్స్ ప్రత్యేకత, వాటిని మొక్కగా మార్చే క్రమాన్ని వివరిస్తూ పర్యావరణ పరిరక్షణలో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ అతిథులకు నవ దంపతులు ప్రత్యేకంగా లేఖ రాశారు. ఈ లేఖను సైతం అతిథులకు అందించారు.

ప్రాముఖ్యత...

పర్యావరణానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో సంప్రదాయానికి అంతే ప్రాముఖ్యత ఇచ్చారు. గోవును కళ్యాణ మండపానికి తీసుకువచ్చి.. దానికి పూజ చేసిన తర్వాతే మిగిలిన కార్యక్రమాలు ప్రారంభించారు. దేశం నలుమూలలకు చెందిన వివిధ పీఠాధిపతులు, స్వామీజీలను ప్రత్యేకంగా ఆహ్వానించారు. వారి సమక్షంలో కళ్యాణాన్ని కమణీయంగా నిర్వహించారు. చెవులు హోరెత్తే బ్యాండ్, డీజే సౌండ్​లకు బదులు నాదస్వర మంగళవాద్యాలు వినియోగించారు. భక్తి, పెళ్లితంతు ప్రత్యేకతలు వివరించే పాటలతో కచేరి పెట్టించారు.

పెళ్లి ఒక ఆదర్శం...

పర్యావరణ పెళ్లికి అతిథుల నుంచి మంచి స్పందన వచ్చింది. వేడుకల పేరుతో విచక్షణారహితంగా ప్లాస్టిక్ వినియోగిస్తున్న రోజుల్లో ఇలాంటి పెళ్లి ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. పెళ్లికి హజరైన మంత్రి హరీశ్​రావు పర్యావరణం కోసం వీరు చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు. తన ట్విట్టర్లో ఈ వివాహం గురించి ప్రస్తావించి స్ఫూర్తి అని కొనియాడారు. అరటి ఆకులో సంప్రదాయ భోజనం చేయడం మంచి అనుభూతి ఇచ్చిందని అతిథులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ పర్యావరణహిత పెళ్లిలో కరోనా నివారణ చర్యలు సైతం తీసుకున్నారు.

ఇదీ చూడండి:నేటి నుంచి పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు

Last Updated : Dec 21, 2020, 8:09 PM IST

ABOUT THE AUTHOR

...view details