రాష్ట్రంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో జలవనరులు నీటికళను సంతరించుకున్నాయి. నీటి ప్రవాహాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ వంతెనపై నుంచి మోయతుమ్మెద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఉదయం లారీ డ్రైవర్ లారీతో సహా వాగు దాటే ప్రయత్నం చేయగా.. లారీ కొట్టుకు పోయింది.
లారీ క్లీనర్‌ను గ్రామస్థులు రక్షించారు. డ్రైవర్ వాగులో కొట్టుకు పోతూ, ఒక చెట్టును పట్టుకుని దానిపై ఆధారపడి మధ్యాహ్నం వరకు ప్రాణం కాపాడుకోవాలని విశ్వప్రయత్నం చేశాడు. సహాయక చర్యలు కాస్త ఆలస్యం కావడం వల్ల అతన్ని రక్షించటానికి గ్రామస్థులు తాళ్లు కట్టిన రబ్బర్ ట్యూబును వదిలారు. దానిని పట్టుకున్న డ్రైవర్‌ను ఒడ్డుకు లాగే ప్రయత్నంలో, వాగు మధ్య వరకు వచ్చిన లారీ డ్రైవర్ వాగులో ప్రవాహం ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. లారీ డ్రైవర్ ఆదిలాబాద్ జిల్లాకు ముదిగొండ శంకర్‌గా గుర్తించారు.
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశానుసారం పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ హైదరాబాద్ రెస్క్యూ టీం అధికారులతో మాట్లాడి వ్యక్తిని కాపాడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రెస్క్యూ టీం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌తో, ఘటనా స్థలానికి కొంచెం ఆలస్యంగా చేరుకుంది. అప్పటికే డ్రైవర్ వాగులో కొట్టుకుపోయాడు.