తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలింగ్ శాతం తగ్గినా..నాలుగో స్థానంలో జహీరాబాద్

జహీరాబాద్ లోక్​సభ నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు గట్టి ప్రయత్నమే చేశారు. అయినప్పటికీ గత ఎన్నికల కంటే తక్కువ శాతమే నమోదయింది. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోనే 67.80 శాతంతో నాలుగో స్థానంలో నిలిచింది.

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్​

By

Published : Apr 12, 2019, 3:51 AM IST

జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అత్యంత మారుమూల ప్రాంతాలను కలిగిన ఈ నియోజకవర్గ ఎన్నికల నిర్వహణను అధికారులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రక్రియను పూర్తి చేశారు. ఈవీఎం మోరాయింపులతో పోలింగ్​ ఉదయం నుంచి మందకొడిగానే సాగింది.

ఈవీఎంలలో 12 మంది అభ్యర్థుల భవితవ్యం

జహీరాబాద్ పార్లమెంట్​ పరిధిలోని సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మెుత్తం 12మంది బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. 2014లో జరిగిన ఎన్నికల్లో 85.03శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి 67.80శాతానికి పడిపోయింది.

ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్​

సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో ఎం-2 తరహా ఈవీఎంలు ఉపయోగించడం వల్ల సాంకేతిక సమస్యలు అధికంగా తలెత్తాయి. పలు కేంద్రాల్లో మాక్ పోలింగ్​తో పాటు..పోలింగ్ కూడా ఆలస్యంగా ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లాలోని కల్హేర్ మండలంలో ఈవీఎంలు పనిచేయకపోవడం వల్ల ఉదయం ఐదు గ్రామాల్లో పోలింగ్ అలస్యంగా ప్రారంభమైంది. ఎండ తీవ్రత పెరిగే కొద్దీ వీవీ ప్యాట్లలో, ఈవీఎంలలో సమస్యలు అధికమయ్యాయి. కొన్ని కేంద్రాల్లో చివరి గంటలో కూడా ఈవీఎంలు మెురాయించాయి. సాంకేతిక నిపుణులు సరి చేసే ప్రయత్నం చేసినా.. కొన్ని చోట్ల యంత్రాలు సరిగ్గా పని చేయలేదు. అధికారులు కొత్త వాటితో పోలింగ్ కొనసాగించారు.

నిరంతర పర్యవేక్షణ

నారాయణ్ ఖేడ్, జుక్కల్ వంటి మారుమూల ప్రాంతాల్లో అధికారులు ప్రత్యేక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద నాలుగు అంచెల భద్రతను నియమించారు. మరోవైపు లైవ్ వీడియో స్ట్రీమింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ వంటి వాటితో నిరంతర పర్యవేక్షణ చేశారు. పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు కృషి చేసినా రాష్ట్రంలో జహీరాబాద్ నాలుగో అత్యధిక పోలింగ్ స్థానంగా నిలిచింది.

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్​

ఇవీ చూడండి: ఉత్కంఠ వీడింది... పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది

ABOUT THE AUTHOR

...view details