తెలంగాణ

telangana

ETV Bharat / state

వామ్మో..! ఆ ఇంటికి 75 గదులు... 101 దర్వాజలు... - house

సాధారణంగా ఇంట్లో ఎన్ని గదులు ఉంటాయి? పెద్ద భవంతైతే 10 నుంచి 12 గదులు ఉంటాయి! ఎన్ని దర్వాజలు ఉంటాయి...? ఓ 20 లేదా 30 వరకు ఉండొచ్చు! ఇందుకు భిన్నంగా సంగారెడ్డి జిల్లాలో ఓ ఇంట్లో మాత్రం 75 గదులు, 101 దర్వాజలు ఉన్నాయి. అసలు ఆ ఇంటి ప్రత్యేకత, గొప్పతనం గురించి తెలుసుకుందాం.

వామ్మో..! ఆ ఇంటికి 75 గదులు... 101 దర్వాజలు...

By

Published : Aug 3, 2019, 10:52 AM IST

Updated : Aug 3, 2019, 1:14 PM IST

వామ్మో..! ఆ ఇంటికి 75 గదులు... 101 దర్వాజలు...

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కేంద్రంలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటి నిర్మాణం వెనుక ఓ మానవీయ కోణంతో పాటు 400 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లో ఈ ప్రాంతంలో తీవ్ర కరవు రాగా.. పంటలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామస్థులకు పని కల్పించేందుకు ఆ ప్రాంత జమీందారు సంగప్ప పటేల్‌ ఇంటి నిర్మాణం చేపట్టారు. ప్రతి రోజు కనీసం 200 మందితో సుమారు సంవత్సరం పాటు శ్రమించి నిర్మించారు.

ఆ ఇంటికి ఎన్నో ప్రత్యేకతలు:

ఈ ఇంటికి ఒక్కటేమిటి అన్నీ ప్రత్యేకతలే. 30 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ ఇంట్లో రెండు ప్రధాన ద్వారాలతో పాటు 101 దర్వాజలు, 75 గదులు, ధాన్యాగారాలు, పూజ మందిరాలు ఉన్నాయి. నిర్మాణంలో డంగు సున్నం, భారీ రాళ్లను వినియోగించారు. ఇంటి చుట్టూ నిర్మించిన ప్రహరీ గోడ ఎనిమిది అడుగుల వెడల్పుతో ఉంటుంది. అప్పట్లో దీనిపై నుంచి ఎడ్ల బండ్లు వెళ్లేవి. ఇంటికి నాలుగు వైపులా కోటలు... టేకు, ఇప్ప చెక్కలతో భారీ తలుపులతో పాటు వరండాల్లో, గదుల్లో అలంకరణలు చేశారు. చెక్కపై చెక్కిన నగిషీలు అలనాటి కళానైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తాయి.

అప్పట్లో ఆ ఇళ్లే పాఠశాల, గ్రామపంచాయతీ:

మండలంలోని మొట్టమొదటి పాఠశాల ఈ ఇంటిలోనే నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం కూడా ఇటీవలి వరకు ఇక్కడే ఉండేది. ఆ ఇంటి యజమానులు మానవత్వానికి మారుపేరని స్థానికులు అంటున్నారు. గ్రామంలోని పేదలకు ఉచితంగా భూములు ఇచ్చారని.. ఎవరి ఇంట్లో పెళ్లైనా తాళి, మెట్టెలు ఇచ్చేవారని గ్రామస్థులు చెబుతున్నారు.

చరిత్ర గల ఇళ్లు అంతరించిపోతోంది:

ప్రస్తుతం ఈ ఇంట్లో తొమ్మిదో తరం నివసిస్తోంది. కాలంతో పాటు ఒకప్పుడు ఉన్న వేల ఎకరాల భూములు పోయాయి. ఉన్న భూములు కుటుంబ పోషణకే సరిపోతుండగా.. ఇంటి నిర్వహణ చేపట్టలేకపోతున్నారు. ఈ భవనం క్రమక్రమంగా శిథిలావస్థకు చేరుకుంటోంది. కోటగోడలు బీటలు వారుతుంటే.. ఒక్కో గది కూలిపోతోంది.

ఇదీ చూడండి:బంగ్లాదేశ్‌ మార్కెట్‌.... ఇక్కడ అన్ని చవకే!

Last Updated : Aug 3, 2019, 1:14 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details