సంగారెడ్డి జిల్లా యంత్రాంగం రుణమాఫీ పథకం కింద 1,80,968 మంది రైతులను అర్హులుగా గుర్తించింది. తొలి దశ కింద 2018 డిసెంబరు 11 నాటికి రూ.25వేల రుణ బకాయిలున్న రైతులకు సర్కార్ రుణమాఫీ సొమ్ము జమ చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా తొలి విడతలో 17,592 మంది కర్షకులు ఈ కేటగిరిలో ఉన్నట్లు బ్యాంకు అధికారులు లెక్కతేల్చారు. ఈనెల 17 వరకూ వారిలో 7048 మంది ఖాతాల్లో రూ.11.71 కోట్ల నగదు జమ చేసినట్లు లీడ్ బ్యాంకు మేనేజర్ (ఎల్‌డీఎం) మోహన్‌రెడ్డి వెల్లడించారు. మిగిలిన వారి ఖాతాల్లో జమ చేసే ప్రక్రియ కొనసాగుతోందని ఆయన వివరించారు.
తొలి విడతలో 17,592 మందికి రుణమాఫీ
అన్నదాతలకు ఆర్థిక తోడ్పాటును అందించేందుకు ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదును జమ చేస్తోంది. కొద్ది రోజులుగా సర్వర్‌లో సాంకేతిక సమస్యలతో ఈ ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తాయి. తాజాగా అవన్నీ తొలగిపోయాయి. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లాలో ఎంత మంది రుణమాఫీకి అర్హులో అధికారులు గుర్తించారు.. వారిలో ఎంత మందికి సాయం అందించారు..తదితర వివరాలతో ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
ఆధార్ వివరాల ఆధారంగా...
ఆధార్ కార్డు వివరాలు ఇవ్వని రైతులు, బకాయిలు ఉండి మృతి చెందిన వారి విషయంలో ప్రత్యేకంగా పరిశీలన చేస్తున్నారు. రూ.లక్ష లోపు రుణం తీసుకున్న ... రైతుల కుటుంబ సభ్యుల వివరాలన్నీ సేకరిస్తున్నారు. రైతు, అతని భార్య, పిల్లల పేరిట ఉన్న మొత్తం రుణంపై ఆరా తీస్తున్నారు. ఆధార్ కార్డుల్లోని సమాచారం ఆధారంగా పూర్తిస్థాయిలో పరిశీలన తర్వాత నగదు జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆధార్ నంబరు లేని రైతుల వివరాలను ఏఈఓల ద్వారా గ్రామాల వారీగా తనిఖీ చేయాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.