మహిళలు, బాలికలపై ఆధునిక యుగంలోనూ అత్యాచారాలు జరగడం దురదృష్టకరమని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో మానవత్వమనేదే కనిపించడం లేదని మండిపడ్డారు. సంగారెడ్డి పట్టణంలో.. వివిధ కారణాల వల్ల సఖి కేంద్రంలో ఉన్న బాధితులను ఆమె పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
గ్రామాల్లో బాలికల రక్షణపై.. తల్లిదండ్రులకు, పిల్లలకు అవగాహన కల్పిస్తామని సునీత పేర్కొన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 123 అవగాహన శిబిరాలు కల్పించామని గుర్తుచేశారు.
జిల్లాలో సఖి కేంద్రం ఏర్పడినప్పటి నుంచి.. గృహహింస, అత్యాచారాలు, బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు, కిడ్నాప్లకు సంబంధించి.. 286 కేసులు నమోదైనట్లు సునీత తెలిపారు. బాధితులకు కౌన్సిలింగ్ ఇచ్చి, వైద్యసేవలు అందించామని పేర్కొన్నారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశామని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రసూల్, ఆర్డీవో సాయిరామ్, సఖి కేంద్రం నిర్వాహకురాలు శాంతా, కమిషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కొండకోనల్లో.. స్వర్గాన్ని సృష్టించారీ మహిళలు..