తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్​డౌన్​ వేళ రెచ్చిపోతున్న ఇసుక అక్రమార్కులు

లాక్​డౌన్​ సమయంలోనూ కొంతమంది అక్రమార్కులు తమ ప్రతాపం చూపెడుతున్నారు. అధికారులు కరోనా నివారణ చర్యల్లో నిమగ్నమవడం వల్ల ఇదే అదనుగా ఇసుక, మట్టి అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. సంగారెడ్డి జిల్లాలో ధ్వంసమైన చెరువు.. వీరి తీవ్రతకు అద్దం పడుతోంది.

By

Published : May 9, 2020, 1:12 PM IST

Sandstorms at kondapur in sangareddy district
లాక్​డౌన్​ వేళ రెచ్చిపోతున్న ఇసుక అక్రమార్కులు

ప్రభుత్వం ఓ వైపు మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్ధరిస్తుంటే.. అక్రమార్కులు మాత్రం చెరువుల ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చుతున్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం అనంతసాగర్​ గ్రామంలోని చెరువే ఇందుకు నిదర్శనం. సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువును ప్రభుత్వం కోటి 13 లక్షల రూపాయలతో అభివృద్ధి చేసింది. అయితే చెరువులోని నాణ్యమైన ఇసుక, మొరంపై అక్రమార్కుల కన్ను పడింది. గ్రామంలోని చోటా మోటా నాయకులు ఏకమయ్యారు. లాక్​డౌన్​ వీరికి కి మరింత కలిసొచ్చింది. ఇష్టారీతిన జేసీబీలతో తవ్వుతూ ప్రతి రోజు వందల ట్రాక్టర్ల మట్టి అక్రమ రవాణా చేశారు. ఫలితంగా చెరువులో 20 నుంచి 30 అడుగుల లోతు గుంతలు ఏర్పడ్డాయి. అంతలోతుగా తవ్వొద్దని చెప్పినా వినడం లేదని గ్రామస్థులు చెబుతున్నారు.

చెరువు ఆయకట్టు పరిధిలో 300 ఎకరాల సాగుభూమి ఉంది. ఎక్కువ శాతం చిన్న చిన్న రైతులే ఉన్నారు. ఈ గుంతల వల్ల చెరువులో నీరు ఆగడం లేదని రైతులు వాపోతున్నారు. వచ్చిన నీళ్లు వచ్చినట్లే గుంతల్లోకి చేరి భూమిలోకి ఇంకిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకరమైన గుంతలు ప్రాణాంతకంగా మారాయని మత్స్యకారులు గోడు వెళ్లబోసుకుంటున్నారు.

గ్రామస్థులెవరైనా ప్రశ్నిస్తే అధికారుల అనుమతితోనే తవ్వుతున్నామంటూ అక్రమార్కులు దబాయిస్తున్నారు. చెరువు పరిశీలనకు వెళ్లిన ఈటీవీ భారత్ ప్రతినిధులకు సైతం అధికారుల అనుమతితోనే తవ్వుకున్నామని కొందరు చెప్పారు. కెమెరా ముందు చెప్పమనే సరికి తప్పించుకునే ప్రయత్నం చేశారు.

హైదారాబాద్​లో ఉద్యోగం చేసే ఓ గ్రామస్థుడు లాక్​డౌన్ వల్ల గ్రామానికి వచ్చాడు. చెరువు దుస్థితి చూసిన ఆయన.. మంత్రి కేటీఆర్​కు, జిల్లా కలెక్టర్​కు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన అధికారులు.. మట్టి తవ్వుతున్న జేసీబీ, ట్రాక్టర్లు సీజ్ చేశారు. ఘటనపై పూర్తిగా దర్యాప్తు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

మరోవైపు త్వరగా చెరువును పునరుద్ధరించి రైతులను ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:15 నుంచి 'వందే భారత్ మిషన్'​ రెండో దశ

For All Latest Updates

TAGGED:

kondapur

ABOUT THE AUTHOR

...view details