తెలంగాణ

telangana

ETV Bharat / state

Remand prisoners problems: రిమాండ్ ఖైదీల అవస్థలు.. బెయిలొచ్చినా జైళ్లలోనే..! - బెయిల్

తెలిసీ తెలియక క్షణికావేశంలో నేరాలు చేసి జైలుకు వచ్చే రిమాండ్ ఖైదీల్లో పలువురి పరిస్థితి దయనీయంగా మారింది. కనీసం వారికి పూచీకత్తు సమర్పించే స్తోమత లేక విడుదల కాలేకపోతున్నారు. పకడ్బందీ ప్రణాళిక ప్రకారం నేరాలు చేసే బడా బాబులు పలు సందర్భాల్లో తమను ఆరెస్ట్ చేయకుండా కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకునే సందర్భాలు అనేకం. ఇంకా మరికొందరైతే ముందస్తు బెయిల్ తెచ్చుకుంటున్నారు. అలా వీలుకాకుంటే జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ నుంచి వీలైనంత తొందరగా బయటపడేలా బెయిల్ పొందుతున్నారు. పేదరికంలో మగ్గుతున్న పలువురు మాత్రం బెయిల్​పై జైలు బయటికి వచ్చే పరిస్థితులు లేక నాలుగు గోడలకే పరిమితమవుతున్నారు.

Remand prisoners problems
జైళ్లలో రిమాండ్ ఖైదీల కష్టాలు

By

Published : Sep 29, 2021, 6:18 PM IST

ఎవరైనా ఒక కేసులో అరెస్టైతే వారికి 14 రోజుల్లోపే బెయిల్ వస్తుంది. ఇక రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులకైతే జైలు గడప తొక్కకముందే బెయిల్ మంజూరవుతుంది. ఆర్థికంగా బలంగా ఉన్న బడా బాబులకు జైలు నుంచి బయటికి రావడం కేవలం క్షణాల్లో పని. కానీ పలు కేసుల్లో అరెస్టైన పేదలు మాత్రం జైళ్లలోనే మగ్గాల్సి వస్తోంది. వివిధ కేసుల్లో రిమాండ్‌ ఖైదీలకు బెయిలు మంజూరైనప్పటికీ... వారికి పూచీకత్తు ఇచ్చే స్తోమత లేక కారాగారానికే పరిమితమవుతున్నారు. పదుల సంఖ్యలో రిమాండ్‌ ఖైదీలు ఇదే తరహాలో మగ్గిపోతున్నారు.

సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం హద్నూర్‌ గ్రామంలో గతేడాది డిసెంబరులో సోనమ్మ(70) అనే మహిళ హత్య జరిగింది. కుటుంబకలహాల కారణంగా ఆమె కుమార్తె ఇందిర(50), మనవరాలు లక్ష్మి కలిసి ఈ హత్య చేశారని పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానం జ్యూడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో వారిని జైలుకు తరలించారు.

పూచీకత్తు లేక 9 నెలలుగా జైళ్లోనే..

దాదాపు 9 నెలలుగా తల్లీ, కూతుళ్లు జైల్లోనే మగ్గుతున్నారు. కొన్ని చాలా తీవ్రమైన కేసుల్లో 90 రోజుల్లో బెయిల్‌ తీసుకునే అవకాశముంటుంది. ఈ కేసులో వారిద్దరికీ బెయిల్‌ లభించింది. పూచీకత్తు సమర్పించే స్తోమత వారికి లేకపోవడంతో జైల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ విధంగా బయటకు రావాల్సిన ఖైదీలు పదుల సంఖ్యలో జైళ్లలోనే మగ్గిపోతున్నారు.

నిబంధనల ప్రకారం రిమాండ్ ఖైదీలకు నిర్ణీత కాలం తర్వాత బెయిల్ తీసుకుని బయటికి వచ్చే అవకాశముంది. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. సాధారణ నేరాల్లో 60 రోజులు, తీవ్రమైన నేరాల్లో 10 రోజులు జ్యూడీషియల్ రిమాండ్ కింద ఉన్న వారికి తప్పనిసరి. బెయిల్ తీసుకోవచ్చని నిబంధనలు చెబుతున్నాయి. అయినా అటువంటి అర్హత కలిగిన కొందరు ఖైదీలు బయటపడలేపోతున్నారు. కారణం బెయిల్​పై బయటికి వచ్చేందుకు అవసరమైన పూచీకత్తు సమర్పించే స్థోమత లేకపోవడం ప్రధాన కారణం.

బెయిల్​ మంజూరైన జైళ్లలోనే..

సాధారణంగా బెయిల్ తీసుకునేందుకు న్యాయవాదిని సైతం సమకూర్చుకోలేని రిమాండ్ ఖైదీల కోసం జిల్లాల వారీగా న్యాయ సేవాధికార సంస్థలు పనిచేస్తున్నాయి. వీటి పరిధిలోని లీగల్ ఎయిడ్ అడ్వొకేట్లు ఇలాంటి ఖైదీల కోసం బెయిల్ మంజూరు చేయించేందుకు సేవలందిస్తున్నారు. ఈ న్యాయవాదులు తరచూ జైళ్లను సందర్శిస్తూ, బెయిల్​కు అర్హత కలిగిన ఖైదీల వివరాలు సేకరిస్తున్నారు. నిర్ణీత కాలం దాటినా అభియోగపత్రాలు దాఖలు కాని కేసులనూ గుర్తించి నిందితులకు బెయిల్ వచ్చేందుకు సహకరిస్తున్నారు. తీరా బెయిలొచ్చినా కూడా ఆర్థిక స్తోమత లేని కారణంగా పూచీకత్తు సమర్పించలేక పలువురు జైళ్లలోనే ఉండిపోతున్నారు.

కృషి చేస్తున్న లీగల్ ఎయిడ్ లాయర్లు

చాలా కేసుల్లో కుటుంబంలో సంపాదించే వ్యక్తి జైలుకు వెళ్లడంతో బాధిత కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉంటున్నాయి. ఇటువంటి ఉదంతాల్లో లీగల్ ఎయిడ్ న్యాయవాదులు పరిస్థితిని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో రెండు ష్యూరిటీలు ఇచ్చే బదులు ఒక ష్యూరిటీ సమర్పించేందుకు న్యాయస్థానం అనుమతిస్తోంది. ఆ ఒక్కటి సమకూర్చలేక పలువురు జైళ్లలోనే ఉండిపోతుండటం గమనార్హం. సాధారణంగా న్యాయస్థానం అడిగిన పూచీకత్తు సమర్పించేందుకు ఇంటి విలువను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కొన్ని కేసుల్లో నిందితులు బెయిల్​పై బయటికొచ్చిన అనంతరం న్యాయస్థాయంలో కేసు వాయిదాకు హాజరు కావాల్సి ఉంటుంది. మూడు వాయిదాలకు హాజరు కాకపోతే న్యాయస్థానం నాన్​ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తుంది. అలాంటి సమయంలో సదరు నిందితుడికి పూచీకత్తు, ఇచ్చిన వ్యక్తులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకే పలువురు ఖైదీలకు పూచీకత్తు లభించడం లేదు. అలాంటి వారి విషయంలో స్వచ్చంద సంస్థలు చొరవ చూపాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇదీ చూడండి:Food : పది రూపాయలకే భోజనం.. జైళ్లశాఖ ఔదార్యం

ABOUT THE AUTHOR

...view details