Bharat Jodo Yatra: భాజపా పాలన నుంచి దేశాన్ని రక్షించే ఉద్దేశ్యంతో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రాష్ట్రంలో ఉత్సాహంగా కొనసాగుతోంది. పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజలు మమేకం అవుతూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. భారత్ జోడో యాత్ర ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతుండగా.. గణేష్ గడ్డ నుంచి ఉదయం 6గంటలకు ప్రారంభమైన పాదయాత్ర.. సంగారెడ్డి శివారు వరకు చేరుకుంది.
పాదయాత్రలో సంగారెడ్డి జిల్లాలో పలువురు వెన్నెముక వికలాంగులు రాహుల్‌గాంధీని కలిసి తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతిపత్రం సమర్పించారు. మధ్యాహ్నం భోజన సమయం కావడంతో పాదయాత్రకు విరామం ప్రకటించారు. తిరిగి సాయంత్రం 4గంటలకు ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పాదయాత్రలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పీసీసీ నాయకులు ఉత్తమ్ కుమార్, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి తదితరులతో పాటు కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు.