తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆహార భద్రత కార్డులు రాలేదు... కష్టకాలంలో రేషన్ లేదు

నిరుపేదలకు నిత్యావసర సరకులు తక్కువ ధరలకే అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగానే ప్రజాపంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేసింది. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రేషన్‌కార్డుదారులకు ప్రతినెలా సరకులు అందిస్తున్నారు. గతంలో అన్ని రకాల నిత్యావసరాలు ఇచ్చేవారు. ప్రస్తుతం బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. చౌక దుకాణాల ద్వారా ఇస్తున్న బియ్యం పక్కదారి పట్టకుండా ఇప్పటికే సర్కారు పలు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇంతవరకు బాగానే ఉన్నా, కొత్తగా ఆహార భద్రత కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోవటంతో ఎంతో మంది పేదలు ఇబ్బందులు పడుతున్నారు. అర్జీలు సమర్పించి ఏడాది గడుస్తున్నా కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు.

new-ration-card-applications-pending-in-sangareddy-district
ఆహార భద్రత.. అర్జీలతో సరి!

By

Published : Jul 2, 2020, 9:01 AM IST


సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఆహార భద్రత కార్డులకు సంబంధించిన దరఖాస్తులకు మోక్షం లభించడంలేదు. సార్వత్రిక ఎన్నికల సమయం నుంచీ ఇదే పరిస్థితి. వేలాది అర్జీలు అందినా వీటిపై ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. మీసేవ ద్వారా కొత్తగా కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకూ ఏడాది కిందట వీలుకల్పించారు. జిల్లా వ్యాప్తంగా 10,258 అర్జీలు వచ్చాయి. మీసేవ ద్వారా వచ్చే వాటిని మండల స్థాయిలో రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌, తహసీల్దార్‌ పరిశీలించి అర్హుల వివరాలను డీఎస్‌వో కార్యాలయానికి అప్‌లోడ్‌ చేయాలి. అందిన వాటిలో 9,100 దరఖాస్తులను డీఎస్‌వో కార్యాలయానికి పంపించినా అవన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి.

రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ స్థాయిలో 1,137, తహసీల్దార్‌ స్థాయిలో 21 దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయి. డీఎస్‌వో స్థాయిలో ఆమోదించి ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేసేందుకు అవకాశంలేకుండా చేయడమే దీనికి కారణం. ఆహార భద్రత కార్డుల కోసం అత్యధికంగా పటాన్‌చెరు మండలం నుంచి 1,384, జహీరాబాద్‌లో 787 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. గతంలో కార్డు తీసుకున్న సమయంలో తమ పిల్లల పేర్లు చేర్చని వారు ఇప్పుడు వారి పేర్లను కార్డులో చేర్చేందుకు అవకాశం ఉంటుంది. కొత్త కార్డుల జారీ మాట అటుంచితే చేరికలకు సంబంధించిన వాటికి మోక్షం లభించడంలేదు. ఇలా దాదాపు 5వేలు అపరిష్కృతంగా ఉన్నాయి.
కార్డుల జారీతో నిరుపేదలకు ప్రయోజనం
పెరిగిన ధరలతో బయటిమార్కెట్‌లో బియ్యం కొనలేని పరిస్థితి. కొత్తగా కార్డుల ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. రేషన్‌కార్డులు ఎప్పుడు జారీచేస్తారో తెలియదు. ప్రభుత్వం కార్డుల జారీపై సానుకూల నిర్ణయం తీసుకుంటే పేదల ఆకలిబాధలు కొంతైనా తీరేందుకు వీలుంటుంది. కార్డులు జారీచేసి సరకులు పంపిణీచేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.

ఏడాది కిందట దరఖాస్తు చేసినా..

- బస్వరాజ్‌, చౌటకూరు
రేషన్‌ కార్డులో తమ కూతురు పేరు చేర్చాలని గతేడాది మే నెలలో దరఖాస్తుచేశా. మీసేవలో దరఖాస్తు చేసి ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు పేరు చేర్చలేదు. అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందన కరవైంది. ఇప్పటికైనా స్పందించి పేరు కార్డులో చేర్చాలి.

కొత్త కార్డుకు నిరీక్షణ

- పోచయ్య, మేడికుంద, వట్‌పల్లి
కొత్తగా రేషన్‌ కార్డు ఇవ్వాలని దరఖాస్తు చేశాం. గతేడాది జూన్‌లో దరఖాస్తుచేయగా ఇప్పటివరకు కార్డు అందలేదు. అధికారులు చుట్టూ తిరుగుతున్నా ఉపయోగం ఉండటంలేదు. కార్డు కోసం ఇంకెన్నాళ్లు నిరీక్షించాలో తెలియని పరిస్థితి. పేదలకు కార్డుల జారీ విషయంలో జాప్యం లేకుండా చూడాలి.

త్వరలో మంజూరయ్యే అవకాశం
రవి, ఇన్‌ఛార్జి జిల్లా పౌరసరఫరాల అధికారి
కొత్తగా రేషన్‌కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులకు త్వరలో మోక్షం లభించే అవకాశం ఉంది. దరఖాస్తుదారుల్లో అర్హులందరికీ కార్డులు అందేలా చూస్తాం. అర్హుల ఎంపికలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ముందుకుసాగుతాం. అనర్హుల దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయి.

ఇవీ చూడండి: నియోజకవర్గానికో గ్రంథాలయం నిర్మిస్తాం: మంత్రి సబిత

ABOUT THE AUTHOR

...view details