Mla Jaggareddy: రాష్ట్ర కాంగ్రెస్‌లో మరోసారి ముసలం మెుదలైంది. సంగారెడ్డి ఎమ్మెల్యే, పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు జగ్గారెడ్డి.. శుక్రవారం సాయంత్రం ఉన్నపలంగా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. తెరాస కోవర్టుగా కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారం రాస్తూ.. అవమానాలకు గురి చేస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో పార్టీలో ఉండలేనని స్పష్టం చేశారు. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో చర్చించిన తర్వాత.. రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జగ్గారెడ్డి.. కొందరి నేతల తీరు వల్ల భారమైనా.. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు స్పష్టం చేశారు.
వెనక్కి తగ్గేదే లే..
జగ్గారెడ్డి నిర్ణయంతో సీనియర్ నేతలు ఆయనను బుజ్జగించే పనిలోపడ్డారు. వి. హనుమంతరావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్‌తో కలిసి.. జగ్గారెడ్డి ఇంటికి వెళ్లారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీలో ఉండి కొట్లాడదామని.. అందుకు మద్దతిస్తామని తెలిపారు. అనంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇంట్లో మరో వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్.. జగ్గారెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కాంగ్రెస్‌లో తనపై చేస్తున్న దుష్ప్రచారం.. మానసికంగా ఇబ్బందులకు గురి చేసిందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చానని.. అందుకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. కొంతకాలం వేచి చూడాలని.. దిల్లీకి వెళ్లి అభిప్రాయాలు చెప్పాలని నేతలు సూచించారు. ఈ క్రమంలో 10 రోజులు ఆలస్యంగా నిర్ణయం ప్రకటిస్తానేమో కానీ.. వెనక్కి తగ్గేది లేదని జగ్గారెడ్డి పునరుద్ఘాటించారు.
పార్టీ కోసం కష్టపడితే.. దోషిగా చూస్తున్నారు..