Minister Harish Rao Speech at BRS Public Meeting at Zaheerabad :కేసీఆర్ దెబ్బకు బీజేపీ డకౌట్.. కాంగ్రెస్ రనౌట్.. కేసీఆర్ మాత్రం సెంచరీ కొడతారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు(Harishrao) ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి 30 స్థానాల్లో అభ్యర్థులే లేరు.. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చుడే ఎక్కువ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఎన్నికల్లో 88 సీట్లను గెలుచుకున్నాం.. ఈసారి కచ్చితంగా 100 సీట్లు గెలుచుకుంటామని(Telangana Assembly Election 2023) స్పష్టం చేశారు.
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావు(Harishrao Zaheerabad Tour)పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా రూ.160 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మరికొన్ని అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆ తర్వాత భాగారెడ్డి స్టేడియంలో జరిగిన బీఆర్‌ఎస్ బహిరంగ సభ(BRS Public Meeting)లో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
Harish Rao Comments on BJP and Congress:తప్పిపోయో.. పొరపాటునో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కైలాసంలో పెద్దపాము మింగినట్లు అమాంతం కిందపడిపోతారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కన్నతల్లికి అన్నం పెట్టలేనోడు.. పినతల్లికి బంగారు గాజులు చేయిస్తాడట అంటూ ఎద్దేవా చేశారు. నడ్డా వచ్చి తెలంగాణలో హంగ్ వస్తుందని అంటున్నారు.. కానీ ఈసారి కచ్చితంగా హ్యాట్రిక్ కొడతాం రాసి పెట్టుకొండని నడ్డాకు సవాల్ విసిరారు. మిస్టర్ నడ్డా 'తెలంగాణ గడ్డ.. కేసీఆర్ అడ్డా' అంటూ విరుచుకుపడ్డారు. సొంత రాష్ట్రంలో గెలవని నడ్డా.. తెలంగాణలో గెలుస్తారని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ ఫేక్ సర్వేలను పెడుతుందని ధ్వజమెత్తారు. జాకీ పెట్టిన తెలంగాణలో బీజేపీ లేవదు, కాంగ్రెస్ గెలవదని మంత్రి హరీశ్‌రావు విమర్శలు చేశారు.