నాతో వస్తే అభివృద్ధి పనులు ఎలా ఉంటాయో చూపిస్తా, కిషన్‌రెడ్డికి హరీశ్ సవాల్ Minister Harish Rao fires on bjp leaders: పోరాటాల గడ్డ వరంగల్ వేదికగా భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా జూటా మాటలు మాట్లాడారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. సిద్దిపేటలో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి హరీశ్‌రావు... భాజపా నేతలపై మండిపడ్డారు. ఓరుగల్లులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు శరవేగంగా సాగుతున్నాయన్న ఆయన... తనతో వస్తే పనుల తీరు చూపిస్తానని సవాల్ విసిరారు. బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిలో తట్టెడు మట్టి తీయలేదని కేంద్రంపై విమర్శలు గుప్పించారు.
''పోరాటాల గడ్డపై జేపీ నడ్డా అబద్ధాలు మాట్లాడారు. తెలంగాణ పోరాటాల గడ్డ.. ప్రజలు నడ్డా మాటలు నమ్మరు. బీబీనగర్ ఎయిమ్స్‌కు.. వరంగల్ ఆస్పత్రికి తేడా చూపిస్తా. కిషన్‌రెడ్డి నాతో వస్తే వరంగల్ ఆస్పత్రి పనులు చూపిస్తా. గుజరాత్, మహారాష్ట్రలో పింఛన్లు ఎందుకు ఇస్తలేరు?'' -మంత్రి హరీశ్‌రావు
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలపొద్దని వ్యతిరేకించిన మహానీయుడు దివంగత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపుజీ అన్నారు. తొలిదశ ఉద్యమంలో మంత్రి పదవికి కొండా లక్ష్మణ్ బాపూజీ రాజీనామా చేస్తే.. మలిదశ ఉద్యమంలో మంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు.
సిద్దిపేట జిల్లాలోని సుడా పార్కులో నెలకొల్పిన కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు. బాపూజీ త్యాగాలు భవిష్యత్ తరాలకు తెలియాలి. విలువలకు కట్టుబడిన వ్యక్తిగా జీవితాంతం అదే విలువలతో బతికారని ఆయన సేవలను కొనియాడారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమనేత కేసీఆర్‌కు కొండా లక్ష్మణ్ అండగా ఉన్నారనే విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. పద్మశాలీ సంఘం వర్గాలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి బీమా వయస్సు సడలింపు గురించి ఆలోచన చేస్తామన్నారు.
కాంగ్రెస్ హయాంలో హ్యాండ్లూమ్ బోర్డును ఏర్పాటు చేస్తే.. ఇవాళ కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రద్దు చేసిందని, చేనేత రంగానికి ఇది పెద్ద దెబ్బగా మారిందన్నారు. హ్యాండిక్రాఫ్ట్ బోర్డ్, పవర్ లూమ్ బోర్డ్, ఎనిమిది పరిశోధన సంస్థలను కూడా కేంద్రం రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం చేనేత కార్మికుల అన్ని రకాల అప్పులు మాఫీచేసి నేతన్నలకు అండగా నిలిచిందని మంత్రి వెల్లడించారు. చేనేత కార్మికులకు రూ.600 కోట్ల రూపాయల బతుకమ్మ చీరలకు ఆర్డర్ ఇచ్చామని, స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా రూ.1.20 కోట్లాది జాతీయ జెండాలను తెలంగాణ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చి చేనేతలకు అండగా నిలిచామని చెప్పారు.