విత్తనాలే దేవుళ్లు.. జీవ వైవిధ్యమే దేవాలయం నినాదంతో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ నిర్వహించే పాత పంటల జాతర రేపటి నుంచి ప్రారంభం కానుంది. సంక్రాంతి పండుగ రోజున గత 19 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న చిరుధాన్యాల జాతర ఈ ఏడు జహీరాబాద్ మండలం పస్తాపూర్‌లో జరుగనుంది. గ్రామీణ ప్రాంతాల సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ జాతరను నిర్వహిస్తామన్నారు.
రేపటి నుంచి ప్రారంభమయ్యే జాతర ఉత్సవాల వివరాలను డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్ పీవీ సతీశ్ పస్తాపూర్‌లోని కార్యాలయంలో వివరించారు. జనవరి 14వ తేదీన ప్రారంభమయ్యే జాతర.. ఐదు మండలాల్లోని 28 గ్రామాల్లో పర్యటించి ఝరాసంగం మండలం మాచనూర్లో ఫిబ్రవరి 15వ తేదీన ముగియనుందని ఆయన తెలిపారు.