తెలంగాణ

telangana

ETV Bharat / state

belt shops in Marepally: జీవితాలు బుగ్గి చేస్తున్న మద్యపానం.. బెల్టుషాపులపై గ్రామస్థుల మూకుమ్మడి దాడి

belt shops in Marepally: పచ్చని కాపురాల్లో గొలుసుకట్టు మద్యం దుకాణాలు చిచ్చు రేపుతున్నాయి. పల్లెల్లో పేదల పాలిట శాపంగా మారాయి. పొట్టకూటి కోసం కూలి పనికి వెళ్లే వారే అధికసంఖ్యలో మద్యం బానిసలుగా మారి చివరకు ప్రాణాలు కోల్పోతున్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లిలో బెల్టు షాపుల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

belt shops in Marepally
మద్యానికి బానిసై నవీన్ ఆత్మహత్య

By

Published : Feb 1, 2022, 10:30 PM IST

Updated : Feb 2, 2022, 12:48 PM IST

మారేపల్లి గ్రామంలో బెల్టుషాపులపై మూకుమ్మడి దాడి

belt shops in Marepally: పల్లెల్లో గొలుసుకట్టు మద్యం దుకాణాలు.. కుటుంబాల్లో కల్లోలం రేపుతున్నాయి. కూలీ నాలీ చేసుకొని బతికే నిరుపేదల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. తాగుడుకు బానిసలుగా మారి చివరకు ప్రాణాలు కోల్పోతున్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లిలో బెల్టు షాపుల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వీటి వల్ల నాలుగు నెలల వ్యవధిలో ఐదుగురు గ్రామస్థులు ప్రాణాలు కోల్పోయారు. బెల్ట్ షాపులు వద్దని నిరసన తెలిపినందుకు పదమూడు మంది జైలు పాలయ్యారు. మృతుల కుటుంబాల వేదన మీద "ఈటీవీ భారత్"అందిస్తున్న కథనం.

రాత్రీ పగలు తేడా లేకుండా షాపులు

liquor shops: మారేపల్లి గ్రామంలో బెల్టు షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయి. రాత్రీ పగలు తేడా లేకుండా మద్యం ఇక్కడ అమ్ముతున్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్... కిరాణా దుకాణం.. ఇలా ఆరు చోట్లకు ఏ సమయంలో వెళ్లినా మందు దొరుకుతుంది. రోజూ వచ్చి తాగేవారికి ఉద్దెర కూడా ఇస్తుంటారు. దీంతో ఈ గ్రామంలో చాలా మంది తాగుడుకు బానిసలయ్యారు.

తాగుడుకు బానిసై ఆత్మహత్య

suicide: ఇటీవల నవీన్ అనే యువకుడు తాగిన మత్తులో ఉరి వేసుకొని చనిపోయాడు. ఆయనకు భార్య...ఇద్దరు ఆడపిల్లలు. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన అతడి భార్య తమకు దిక్కేవరంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన బిడ్డలను ఎలా పెంచాలంటూ విలపిస్తోంది.

'నా కొడుకు నవీన్ పని చేస్తుండేవాడు. చెత్తబండిపైనే పని చేసుకుంటూ మేం బతుకుతున్నాం. మా చేతికి ఏం డబ్బులు ఇవ్వడు. మమ్మల్ని డబ్బులివ్వకపోతే కొట్టేవాడు. నేను ఊర్లోకి పోయేసరికి ఉరి వేసుకున్నాడు. నా కొడుకులాగే మరో నలుగురు ఇలానే చనిపోయిన్రు సార్. దయచేసి మా ఊర్లో మందు షాపులు బంద్ చేయించండి సార్.' - నవీన్ తల్లి

నవీన్ ఇంటి సమీపంలో ఉండే అశోక్ కూడా మద్యానికి బానిసయ్యాడు. ఊర్లో ఉన్న దుకాణాల్లో మద్యం కొనుక్కొని తాగేవాడు. అలా ఒకరోజు బాగా తాగిన ఆయన నిద్రలోనే కన్నుమూశాడు.

'మా నాన్న పేరు అశోక్. తాగుడుకు బానిసై చనిపోయారు. అంతకుముందు మా తమ్ముడు కూడా చనిపోయాడు. ఊర్లో కిరాణ షాపుల్లో మందు అమ్ముతున్నారు. ఉద్దెర కూడా ఇస్తున్నారు. మద్యం అమ్మడం వల్ల కుటుంబాలు ఆగమైతున్నాయి. గ్రామంలో బెల్ట్​ షాపులు బంద్ చేయించండి.' - అశోక్ కుమారుడు

ఇల్లరికం తెచ్చుకుంటే మగదిక్కు లేకుండా పోయాడు

నర్సింహులు అనే వ్యక్తి ఏకంగా గొలుసు దుకాణం వద్ద పడిపోయి మరణించాడు. కొడుకులు లేని తాను... తన బిడ్డకు నర్సింహులుతో పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకున్నానని.. కానీ మద్యపానం తమ ఇంట్లో మగదిక్కును లేకుండా చేసిందని నర్సింహులు అత్త మైసమ్మ వాపోయింది. యువకుడు రాజు.. ముగ్గురు కొడుకులకు తండ్రి అయిన మీసాల అశోక్ కూడా మద్యపానం కారణంగా మరణించారు. కుటుంబ సభ్యులకు తీరని దుఃఖాన్ని మిగిలించారు.

'నా భర్త తాగుడుకు బానిసయ్యాడు. మాకు డబ్బులు ఇచ్చేవాడు కాదు. రోడ్డు పక్కనే తాగి చనిపోయిండు. ఊర్లో మద్యం షాపులు బంద్ చేయించాలే.' - నర్సింహులు భార్య

'నాకు ఒక్కరే కూతురు. నాకు కొడుకులు లేరని అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నా. ఇప్పుడు ఆయన చనిపోయిండు. ఇప్పుడు మాకు మగదిక్కు లేకుండా పోయింది. మేమేట్లా బతకాలే ఇప్పుడు. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి.' - నర్సింహులు అత్త మైసమ్మ

స్థానికుల ఆందోళన

ఇటీవల నవీన్ మృతితో స్థానికులు మద్యం అమ్ముతున్న వారి దుకాణాల వద్దకు వెళ్లి సీసాలు పగలగొట్టారు. అలా గొలుసు దుకాణాలు నడవకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిని పోలీసులు జైలు పాలు చేశారు. పైగా వారి మీద దొంగతనం... హత్యాయత్నం నేరాలను మోపారు. పోలీసుల తీరును నిరసిస్తూ మారేపల్లిలో స్థానికులు ఉద్యమం చేస్తున్నారు.

Last Updated : Feb 2, 2022, 12:48 PM IST

ABOUT THE AUTHOR

...view details