కేంద్రప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా పాలించడం ఏంటని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jaggareddy comments on pm modi) ప్రశ్నించారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడిన రైతులను చంపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లో ప్రియాంక గాంధీ అరెస్టుకు నిరసనగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు. రోడ్డుపై కాంగ్రెస్ నాయకులు బైఠాయించడంతో కాసేపు ట్రాఫిక్ స్తంభించింది. డీఎస్పీ బాలాజీ తమ సిబ్బందితో జగ్గారెడ్డిని, నాయకులను అరెస్టు చేసి పట్టణ పోలీసు స్టేషన్కి తరలించారు.
అమాయక రైతులు బలి
మోదీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల వల్ల అమాయక రైతులు మరణిస్తున్నారని ఆరోపించారు. భాజపా ప్రభుత్వం రైతుల పొట్టకొట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. అధికారంలో ఉన్న నాయకులే కాన్వాయిలతో రైతులపై దూసుకెళ్లడం న్యాయమా? అని ప్రశ్నించారు. ప్రియాంక గాంధీ రైతులను పరామర్శించడానికి వెళ్తే అరెస్టు చేసినందుకు కాంగ్రెస్ తరఫున సోమవారం ధర్నా చేపట్టామన్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కొట్లాడుతుందని స్పష్టం చేశారు. అన్నదాతలకు అండగా ఉంటామని... ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
ఇదీ జరిగింది..
యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో లఖింపుర్ ఖేరీలో(Lakhimpur Kheri violence) హింస చెలరేగింది. టికునియా-బన్బీర్పుర్ సరిహద్దు వద్ద సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులు, అధికార వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణించారు. నిరసన చేస్తున్న అన్నదాతలపైకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్ర కారుతో పాటు మరో వాహనం దూసుకెళ్లడం వల్లే రైతులు మరణించినట్లు తెలుస్తోంది.