అధికారుల అలసత్వం.. ప్రభుత్వాల నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలికొంటున్నాయి. క్వారీల్లో తవ్వకాలకు అనుమతిస్తున్న అధికారులు.. అనంతరం వాటి ఊసేత్తడం లేదు. తవ్వకాలు పూర్తైన తర్వాత నిర్దేశ ప్రమాణాలతో రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉన్నా అధికారులు వాటి జోలికెళ్లడం లేదు. ఫలితంగా గుంతల్లో స్నానాలు చేసేందుకు వెళ్తున్న చిన్నారులు జలసమాధి అవుతున్నారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలో ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
నలుగురు జలసమాధి
వేసవి సెలవుల్లో సేదతీరేందుకు బాలాజీ నగర్‌కు చెందిన ఆనంద్, నందిని, లోకేశ్, గోవర్దన్‌లు పటాన్చెరు మండలం రుద్రారంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. బుధవారం అందరితో భోజనం చేసిన అనంతరం ఈత కొట్టేందుకు సమీపంలోని క్వారీకి వెళ్లారు. దివ్య, అమూల్యాలు ఒడ్డునే ఉండిపోగా.. ఆనంద్, లోకేశ్, నందిని, గోవర్దన్‌లు ఈతకు దిగారు. కాసేపు నీటిలో ఆడుకున్న వారంతా అక్కడే జలసమాధి అవుతామని ఊహించలేకపోయారు. సరదాగా ఈత కొడుతున్న నందిని ఒక్కసారిగా మునిగిపోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో మిగతా ముగ్గురు లోపలికి వెళ్లారు. ఈత రాకపోవడం వల్ల ఎవరూ పైకి రాలేకపోయారు. ఒడ్డుమీదనున్న దివ్య, ఆమూల్య దీన్ని గుర్తించి కుటుంబ సభ్యులుకు, స్థానికులకు సమాచారం ఇచ్చారు. ఎంత ప్రయత్నించినా వారి ఆచూకీ కనుగొనలేకపోయారు.
ఉత్సాహం కాస్తా విషాదం