దేశానికి స్వాతంత్య్రం తెచ్చేందుకు తన జీవితాన్నే త్యాగం చేసిన మహాత్మున్ని స్మరించుకునేందుకు సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం ధనసిరిలో ఐదు దశాబ్దాల క్రితమే గాంధీజీకి గుడి కట్టారు. ఆ గ్రామంలో కులమతాలకు అతీతంగా జాతిపితను పూజిస్తారు. కొన్నాళ్లకు ఈ దేవాలయం శిథిలావస్థకు చేరటం వల్ల 1995లో అప్పటి ఎమ్మెల్యే నరసింహారెడ్డి పునర్నిర్మించారు. మహాత్ముడి స్ఫూర్తిని అందిపుచ్చుకున్న ధనసిరి నుంచి వంద మందికి పైగా... దేశ సైన్యంలో వివిధ విభాగాల్లో సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం సైన్యంలో పనిచేస్తున్న వారితో పాటు విశ్రాంత సైనికులు దేవాలయంలో మహాత్ముడి విగ్రహానికి నివాళులర్పిస్తారు. గ్రామంలోని ప్రధాన కూడళ్లలో... ఛత్రపతి శివాజీ, మహాత్మ బసవేశ్వర్, వాల్మీకి మహర్షి, భూమ్ గొండేశ్వర్, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాలు దర్శనమిస్తాయి. ఏటా గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాలతో పాటు గాంధీ జయంతి రోజున దేవాలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి మహాత్ముడిని స్మరించుకుంటారు.
ధనసిరి గ్రామంలో పని చేసేందుకు పంచాయతీ కార్యదర్శులు, ఉపాధ్యాయులు గౌరవంగా భావిస్తారు. గ్రామస్థులతో మమేకమై ఏటా నిర్వహించే వేడుకల్లో పాల్గొని జాతిపితకు తమదైన శైలిలో నివాళులర్పిస్తారు.