కేంద్రం తాత్సరం, ఆంధ్రా మొండి వైఖరి వల్లే కృష్ణా నీటిలో... తెలంగాణ న్యాయమైన వాట దక్కించుకోలేక పోతోందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. ఆచార్య జయశంకర్ (Professor Jayashankar) స్ఫూర్తితో గోదావరిలో వాటా సాధించామని... కృష్ణా నీటిలోనూ వాటా కోసం సుప్రీం కోర్టులో పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. సంగారెడ్డిలో నిర్వహించిన ఆచార్య జయశంకర్ జయంతి ఉత్సవాల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఆచార్య జయశంకర్ తన జీవితాన్ని తెలంగాణకు అంకితం చేశారని... స్వరాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా, కలగా చివరి శ్వాస వరకు పోరాటం చేశారని హరీశ్ రావు కీర్తించారు. విద్యార్థి దశ నుంచే ఉద్యమం ప్రారంభించిన జయశంకర్ పేరును వ్యవసాయ విశ్వవిద్యాలయానికి... ఓ జిల్లాకు పెట్టుకుని గౌరవించుకున్నామని పేర్కొన్నారు.
జయశంకర్ ఆశయాలను, కలలుగన్న తెలంగాణను నిర్మాణం చేయడమే ఆయనకు ఇచ్చే అసలైన నివాళి అని హరీశ్ రావు తెలిపారు. ఆ దిశగా తెరాస ప్రభుత్వం కృషి చేస్తోందని... అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు.